Abdus Salam Pintu: భారత్‌కు అత్యంత ప్రమాదకర వ్యక్తి... బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదల

The most dangerous man for India came out of Bangladesh jail
  • ఖలీదా జియాకు అత్యంత సన్నిహితుల్లో అబ్దుస్ సలాం పింటు ఒకడు
  • ఆమె క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వైనం
  • భారత్‌పై దాడి కోసం పాక్ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, ఆయుధాల సరఫరా
  • షేక్ హసీనా ర్యాలీపై దాడి.. 24 మంది మృతి
  • 2008లో అరెస్ట్.. 2018లో మరణశిక్ష
  • ప్రభుత్వం మారడంతో ఆ తీర్పు కొట్టేసిన కోర్టు.. జైలు నుంచి విడుదల
  • మళ్లీ మంత్రి అయ్యే చాన్స్.. భారత్ ఆందోళన
షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. మరోవైపు భారత్‌కు అత్యంత ప్రమాదకారి అయిన అబ్దుస్ సలాం పింటును జైలు నుంచి విడుదల చేసి తన ద్వంద్వ వైఖరిని చాటుకుంది. మాజీ మంత్రి అయిన అబ్దుస్.. భారత్‌పై దాడికి ఉగ్రవాదులకు సాయం చేశాడు. షేక్ హసీనా ర్యాలీపై దాడులు చేయించింది కూడా ఆయనే. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా సన్నిహితుల్లో ఒకడిగా చెప్పుకునే అబ్దుస్ విడుదలపై అటు బంగ్లాదేశ్, ఇటు భారత్‌లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఖలీదా జియా ప్రభుత్వంలో పింటు బంగ్లాదేశ్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఈ సందర్భంగా భారత్‌తోపాటు హసీనాపై ఎన్నో కుట్రలు పన్నాడు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయ్యాడు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం ద్వారా వారు భారత్‌కు హాని చేయాలని కుట్ర పన్నారు. ఆ తర్వాత విచారణలో మరో దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడమే కాకుండా వారికి ఆయుధాలు కూడా సరఫరా చేసిన విషయం దర్యాప్తులో వెలుగుచూసింది. 

బంగ్లాదేశ్‌లోనే అత్యంత ప్రమాదకర మంత్రి
2001 నుంచి 2006 వరకు ఖలీదా జియా బంగ్లాదేశ్‌ను పాలించారు. ఆ సమయంలో పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాద గ్రూపులకు బంగ్లాదేశ్ నుంచి ఆర్థిక సాయం అందింది. ఫలితంగా భారత్‌పై దాడులకు ప్రయత్నం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత పింటుపై దర్యాప్తు మొదలైంది. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర మంత్రి అన్న విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌తోపాటు షేక్ హసీనానూ టార్గెట్ చేసిన విషయం బయటకు వచ్చింది. 

పింటుకు మళ్లీ మంచి రోజులు
ఆగస్టు 21, 2004లో హసీనా ర్యాలీపై పింటు దాడిచేయించాడు. ఆ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. హసీనా కూడా గాయపడ్డారు. ఆ తర్వాత 2008లో పింటు అరెస్ట్ కాగా, 2018లో కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. తాజాగా, బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారడంతో పింటుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఆయనను జైలు నుంచి విడుదల చేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత తీర్పు చెల్లుబాటు కాదని పేర్కొంటూ ఈ కేసులో అందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ ఈ నెల 1న తీర్పు ఇచ్చింది. కాగా, పింటు 1991, 2001లో టాంగైల్-2 నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. 

మళ్లీ మంత్రి అయ్యే చాన్స్
ఇప్పుడాయన విడుదలతో అందరిలోనూ మరో ఆందోళన మొదలైంది. ఆయన ఎక్కడ మంత్రి అవుతాడోనని ఆందోళన చెందుతున్నారు. అయితే, ఖలీదా జియాకు ఆయన అత్యంత సన్నిహితుడు కావడంతో మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.   
Abdus Salam Pintu
Bangladesh
Khaleda Zia
India
Dangerous Man

More Telugu News