Kidnap: స్కూలు వద్ద 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై కాల్పులు.. వీడియో ఇదిగో!

Viral Video Kidnappers abduct minor girl near school in Rajasthan
  • రాజస్థాన్‌లోని డీగ్ జిల్లో ఘటన
  • బాలికకు గతేడాదే వివాహం
  • అదనపు కట్నం కోసం అత్తమామల వేధింపులు
  • భరించలేక కొన్ని నెలల క్రితం పుట్టింటికి
  • కిడ్నాప్ వారిపనేనన్న బాలిక తండ్రి
  • కిడ్నాపర్ల కోసం రంగంలోకి మూడు పోలీసు బృందాలు
రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో పట్టపగలు ఓ స్కూలు విద్యార్థిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. సుమోలో వచ్చిన ముగ్గురు నలుగురు కిడ్నాపర్లు బాలికను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో స్థానికులను భయపెట్టేందుకు కాల్పులు జరిపారు. బాలికకు గతేడాదే వివాహమైందని, కట్నం కోసం అత్తమామలు వేధించడంతో తిరిగి ఇంటికి వచ్చేసిందని బాలిక తండ్రి తెలిపారు. ఈ కిడ్నాప్ వెనక వారి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 

కారులో వచ్చిన నిందితులు తుపాకి గురిపెట్టి మరీ బాలికను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిని ఆపేందుకు స్థానికులు ప్రయత్నించగా కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఇది అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలకు కారణమైంది. ముఖ్యమంత్రి మోహన్‌లాల్ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. 

బాలిక స్కూలు వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెకు సమీపంలో ఓ సుమో వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు బాలికను బలవంతంగా లాక్కెళ్లారు. చుట్టూ ఉన్నవారు ఈ ఘటనను చూసి అప్రమత్తమై వారిని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో నిందితులు హెచ్చరికగా కాల్పులు జరపడంతో వారు వెనక్కి తగ్గారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

బాలిక భర్త, బావమరిది, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరకట్న వేధింపులు భరించలేక తిరిగి ఇంటికి వచ్చిన బాలిక చదువు కొనసాగిస్తోందని, అయినప్పటికీ కట్నం కోసం అత్తమామలు ఇంకా వేధిస్తూనే ఉన్నారని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ల కోసం మూడు బృందాలను రంగంలోకి దించినట్టు పేర్కొన్నారు. 

Kidnap
Rajasthan
Crime News

More Telugu News