ap cm chandrababu: నేడు ఢిల్లీలో బిజీబిజీగా ఏపీ సీఎం చంద్రబాబు .. మోదీ, కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

ap cm chandrababu delhi tour meet pm modi amit shah nirmala sitharaman
  • వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
  • మధ్యాహ్నం జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొననున్న సీఎం  
  • సాయంత్రం మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, కుమారస్వామిలతో చంద్రబాబు భేటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఈరోజు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవ్వనున్నారు. అలాగే మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలు, ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు .. ఈ ఉదయం వాజ్‌పేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. 

మధ్యాహ్నం 12.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనున్న ఎన్డీఏ నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం అవుతారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక భేటీ అవుతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపైనా ప్రధాని మోదీ, అమిత్ షాలతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి ప్రయోజనాలు కలిగేలా చంద్రబాబు వారితో చర్చలు జరపనున్నారు. 

తదుపరి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో రాష్ట్ర అంశాలపై చర్చించనున్నారు. ఇటీవలే రాజధాని కోసం మంజూరైన రైలు మార్గం పనులు వీలైనంత వేగంగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిని చంద్రబాబు కోరనున్నారు. అలాగే ఏపీ రాజధాని అమరావతికి ఆర్ధిక తోడ్పాటు, పెండింగ్ నిధుల విడుదల తదితర అంశాలపై ఆర్దిక మంత్రితో చర్చించనున్నారు. 

మరో వైపు ఢిల్లీలోని చంద్రబాబు అధికారిక నివాసంలో సాయంత్రం కేంద్ర మంత్రి కుమారస్వామి ఆయన్ని కలవనున్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. అ తర్వాత దేశ రాజధానిలో పర్యటన ముగించుకుని రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. గురువారం అక్కడ ప్రైవేటు కార్యక్రమాలకు హజరవుతారు. అనంతరం శుక్రవారం తిరిగి అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు.   
ap cm chandrababu
pm modi
chandrababu delhi tour
Amit Shah

More Telugu News