Bihar: పురుష టీచర్ కు ప్రసూతి సెలవులు... బీహార్ లో విడ్డూరం!

bihar education department declares male teacher pregnant grants him maternity leave
  • సోషల్ మీడియాలో మగ ఉపాధ్యాయుడి ప్రసూతి సెలవు స్క్రీన్ షాట్ వైరల్
  • నెటిజన్ల నుంచి విమర్శలతో స్పందించిన విద్యాశాఖ అధికారి
  • సాంకేతిక లోపంతో జరిగిన పొరపాటును సరిచేస్తామన్న విద్యాశాఖ అధికారిణి
బీహార్ విద్యాశాఖలో ఓ విడ్డూరమైన ఘటన చోటుచేసుకుంది. సహజంగా ప్రసూతి సెలవులను మహిళా ఉద్యోగులకు మంజూరు చేస్తుంటారు. అయితే ఓ ఉపాధ్యాయుడికి ప్రసూతి సెలవు మంజూరు కావడం హాట్ టాపిక్ అయింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో విద్యాశాఖ తీరుపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
 
బీహార్‌ విద్యాశాఖలో సెలవుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు విధానం అమలులో ఉంది. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా సెలవు మంజూరయింది. అయితే సాంకేతిక లోపం కారణంగా సదరు ఉపాధ్యాయుడికి మెటర్నిటీ లీవ్‌ మంజూరయినట్లు ఉండటంతో ఆ స్క్రీన్ షాట్‌ను ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. 

విడ్డూరంగా మగ ఉపాధ్యాయుడికి ప్రసూతి సెలవు మంజూరు చేయడం ఏమిటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ తీరును ఆక్షేపిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. సాంకేతిక లోపం కారణంగా ఈ పొరపాటు జరిగిందని, అన్‌లైన్ పోర్టర్‌ను సరి చేస్తామని ఇన్‌ఛార్జి విద్య అధికారి అర్చన కుమారి మీడియాకు తెలిపారు. 

దరఖాస్తు ఫార్మాట్‌లో లోపం కారణంగానే ఉపాధ్యాయుడు జితేంద్ర కుమార్ సింగ్‌కు ప్రసూతి సెలవు మంజూరయినట్లు పేర్కొంది. లోపాన్ని సరిచేస్తామని తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులైన పురుషులు కూడా తమ నవజాత శిశువును చూసుకోవడానికి పితృత్వ అవకాశ్ (ప్రసూతి సెలవు) పేరుతో సెలవు పొందవచ్చని తెలిపారు. అయినా తమ దృష్టికి వచ్చిన ఈ లోపాన్ని సరిదిద్దుతామని ఆమె తెలిపారు.  
Bihar
education department
male teacher
maternity leave
Social Media

More Telugu News