Revanth Reddy: అదానీ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy hot comments on Adani investments
  • పెట్టుబడులను ఒక్క సంతకంతో రద్దు చేయలేమన్న సీఎం
  • చైనా 2 వేల కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని ఆక్రమించిందన్న సీఎం
  • మణిపూర్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోందన్న రేవంత్ రెడ్డి
తెలంగాణలో అదానీ పెట్టుబడుల ఒప్పందాల రద్దుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాసిన 'నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్' పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అదానీ పెట్టుబడుల ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేమన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఒక్క సంతకంతో రద్దు చేసే పరిస్థితి ఉండదన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయని ఆరోపించారు. 

చైనా రెండు వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని, దీనిపై మాట్లాడేందుకు ఎవరికీ ధైర్యం చాలడం లేదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక భారత్ చాలా భూభాగాన్ని కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోందన్నారు. మణిపూర్ అంశంలో భారత్ బలగాలు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. భారత్ కోల్పోయిన భూమి, మణిపూర్ అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

ముల్కీ రూల్స్ పోరాటం నుంచి నేటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ప్రత్యేక పరిమాణ ఘట్టాలపై కూడా పుస్తకం తీసుకు రావాలని కోరారు. శాంతిని కాంక్షిస్తూ 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో యాదవరెడ్డి 'నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్' పుస్తకాన్ని రాశారన్నారు.




Revanth Reddy
Gautam Adani
Telangana
Congress

More Telugu News