చావు అంచుల దాకా వెళ్లిరావడమంటే ఇదేనేమో.. వీడియో ఇదిగో!
- బైక్ ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
- అరిచి కేకలు పెడుతున్నా ట్రక్ ఆపకుండా వెళ్లిన డ్రైవర్
- ఓవర్ టేక్ చేసి ఆపిన బైకర్.. ట్రక్ డ్రైవర్ కు స్థానికుల దేహశుద్ధి
- ఆగ్రా హైవేపై చోటుచేసుకున్న దారుణ ఘటన
ఆదివారం రాత్రి ఆగ్రా హైవేపై చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.. ఆగ్రాకు చెందిన జకీర్ తన స్నేహితుడితో కలిసి హోటల్ లో డిన్నర్ చేసి బైక్ పై ఇంటికి బయలుదేరాడు. ఆగ్రా హైవేపై వెళుతుండగా ఓ ట్రక్ వారిని ఢీ కొట్టింది. దీంతో జకీర్, ఆయన స్నేహితుడు కిందపడగా.. ట్రక్ డ్రైవర్ బండిని ఆపకపోవడంతో బైక్ తో పాటు యువకులు ఇద్దరూ ఇరుక్కుపోయారు.
దాదాపు 300 మీటర్లు ట్రక్ వారిని ఈడ్చుకెళ్లింది. ప్రాణభయంతో వారు కేకలు పెడుతుండడం చూసి ఇతర వాహనదారులు ట్రక్ ను ఆపేందుకు ప్రయత్నించారు. అయినా డ్రైవర్ ట్రక్ ఆపకుండా మరింత స్పీడ్ పెంచాడు. ఓ బైకర్ ఓవర్ టేక్ చేసి బండిని అడ్డంగా నిలపడంతో ట్రక్ డ్రైవర్ బ్రేక్ వేశాడు. యువకులు ఇద్దరినీ కాపాడిన వాహనదారులు.. అంబులెన్స్ కు, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
పోలీసులు వచ్చేలోగా ట్రక్ డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం జకీర్, ఆయన స్నేహితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రక్ ఈడ్చుకెళ్లడంతో వారికి గాయాలయ్యాయని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.