Sports News: మహిళల దేశవాళీ క్రికెట్‌లో నయా చరిత్ర.. వరల్డ్ రికార్డ్ నమోదు

Bengal womens cricket team made history as highest successful run chase
  • హర్యానాపై ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బెంగాల్
  • ‘సీనియర్ ఉమెన్స్ ట్రోఫీ 2024’లో సంచలనం
  • అంతర్జాతీయంగా లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు నమోదు
మహిళల దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర నమోదయింది. వన్డే ఫార్మాట్ క్రికెట్‌లో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా బెంగాల్ మహిళా క్రికెట్ టీమ్ అవతరించింది. ‘సీనియర్ ఉమెన్స్ ట్రోఫీ 2024’లో భాగంగా రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో సోమవారం హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ టీమ్ ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన తనుశ్రీ 83 బంతుల్లోనే 113 పరుగులు బాదింది. ఇందులో 20 ఫోర్లు ఉన్నాయి. దీంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే బెంగాల్ టార్గెట్‌ను ఫినిష్ చేసింది. ఈ గెలుపుతో ‘సీనియర్ ఉమెన్స్ ట్రోఫీ 2024’లో బెంగాల్ జట్టు సెమీ ఫైనల్‌కు చేరింది.

దేశీయంగా చూస్తే అంతకుముందు 2021లో చండీగఢ్‌పై రైల్వేస్ జట్టు ఛేదించిన 356/4 టార్గెట్ రికార్డ్‌గా ఉండేది. అంతర్జాతీయంగా చూసినా బెంగాల్ జట్టుదే అత్యధిక లక్ష్య ఛేదనగా నిలిచింది. 2019లో న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో కాంటర్‌బరీ జట్టుపై నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ టీమ్ 309 పరుగులను ఛేదించింది. ఆ రికార్డును బెంగాల్ జట్టు చెరిపివేసింది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌లో చూస్తే మహిళల క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ఉమెన్స్ టీమ్‌పై శ్రీలంక మహిళ జట్టు సాధించిన 305 పరుగులు అత్యధిక లక్ష్య ఛేదనగా ఉంది.
Sports News
Cricket
Senior Womens Trophy 2024
Bengal Team

More Telugu News