TRAI: రెండు సిమ్ లు వాడుతున్నారా... అయితే ఇది మీకోసమే!

trai asks telecom companies to offer separate recharge plans for voice calls and sms
  • నెట్ అవసరం లేకపోయినా వాయిస్, ఎస్సెమ్మెస్‌తో పాటు డేటా కలగలిపిన ప్లాన్ వోచర్లను రీచార్జి చేసుకుంటున్న ఫీచర్ ఫోన్ కస్టమర్లు
  • డ్యూయల్ సిమ్ వినియోగదారుల పరిస్థితీ అదే
  • వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రీచార్జి ప్లాన్‌లు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు కీలక ఆదేశాలిచ్చిన  ట్రాయ్
స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మంది రెండు సిమ్‌లను వాడుతున్నారు. అయితే ఈ క్రమంలో అవసరం లేకపోయినా రెండో సిమ్ కార్డుకు నెట్ సదుపాయంతో కూడిన రీచార్జి ఓచర్ ప్లాన్‌కు తప్పనిసరిగా అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఫీచర్ ఫోన్ వినియోగదారుల పరిస్థితి అదే. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నెలవారీ ఖర్చు తగ్గించుకునే విధంగా ప్రత్యేక రీఛార్జి ప్లాన్‌లు రాబోతున్నాయి. ఈ మేరకు వినియోగదారులకు టెలికాం నియంత్రణ సంస్థ గుడ్ న్యూస్ అందించింది.

తాజాగా టెలికం కంపెనీలకు టెలికాం నియంత్రణ (ట్రాయ్) కీలక ఆదేశాలు ఇచ్చింది. అది ఏమిటంటే.. వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్‌లు తీసుకురావాలని అయా కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. స్పెషల్ టారిఫ్ వోచర్లు తీసుకురావాలని జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలకు ట్రాయ్ సూచించింది. దీంతో వాడుకున్న సేవలకు మాత్రమే చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభిస్తుందని తెలిపింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఫీచర్ ఫోన్ యూజర్లు, వృద్ధులకు ఉపయోగకరంగా ఇది ఉంటుందని ట్రాయ్ వెల్లడించింది.
 
దాదాపు అన్ని టెలికాం కంపెనీలు ప్రస్తుతం వాయిస్, ఎస్సెమ్మెస్‌తో పాటు డేటా (నెట్) కలగలిపిన ప్లాన్‌లు అందిస్తున్నాయి. దీంతో కస్టమర్లు నెలకు దాదాపు రూ.200 చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి ఫీచర్ ఫోన్ వినియోగదారులకు డేటా అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో డేటాతో కూడిన వోచర్‌ను రీచార్జి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరో వైపు స్మార్ట్ ఫోన్‌లో రెండు సిమ్ కార్డులు వాడే వారు కూడా అవసరం లేకపోయినా రెండో సిమ్‌కు డేటాతో కూడిన రీచార్జి చేస్తూ నెంబర్ వాడుకలో ఉండేందుకు అదనపు ఖర్చు భరిస్తున్నారు. 

అయితే ట్రాయ్ తాజా ఆదేశాలతో తక్కువ ధరలతో ప్యాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం కలుగనుండటంతో వారికి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అంతే కాకుండా స్పెషల్ టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల ప్రస్తుత కాలపరిమితిని 90 రోజుల నుంచి 365 రోజులకు ట్రాయ్ పెంచింది. దీంతో పదే పదే రీఛార్జి చేసుకునే ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే తక్కువ కాలవ్యవధి కల్గిన ప్యాక్‌లను సైతం అందించాలని టెలికం కంపెనీలకు ట్రాయ్ సూచించింది.   
TRAI
telecom companies
recharge plans
voice calls

More Telugu News