Vijayashanti: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన పరిణామాలపై స్పందించిన విజయశాంతి

BJP Leaders trying to create division between peaceful people Vijayashanti Said on Sandhya Theatre row
  • దురదృష్టకర ఘటన తెలంగాణలో ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చేలా వెళుతోందని వ్యాఖ్య
  • ఘటనను బీజేపీ అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందన్న విజయశాంతి
  • కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రుల వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు కోమాలో ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. విపక్ష పార్టీలు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా... అధికార పక్షం నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటన తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చే వరకు వెళుతున్నట్లుగా కనిపిస్తోందని విజయశాంతి వ్యాఖ్యానించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ప్రెస్‌మీట్లు, తదనంతర భావోద్వేగాలు అలాగే అనిపిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామనేది నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అని, అయితే మళ్లీ ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తోందని విజయశాంతి విమర్శించారు. ఏది ఏమైనా ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నట్టుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనిపిస్తున్నాయని విమర్శించారు.

సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణలు చెయ్యడం గర్హనీయమని విజయశాంతి ఖండించారు. సినిమా పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాల్సి ఉంటుందని, ఇదంతా ఎంతవరకు అవసరమన్న పరిశీలన చేసుకొని పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలని ఆమె సూచించారు.
Vijayashanti
Telangana
Andhra Pradesh
BJP
Congress
Revanth Reddy

More Telugu News