Allu Arjun: ఆయన కళ్లలో పశ్చాత్తాపమే లేదు: అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై ఏసీపీ విష్ణుమూర్తి ఫైర్

ACP Vishnumurthy slams Allu Arjun in Sandhya Theater incident
  • తీవ్ర రూపు దాల్చిన సంధ్య థియేటర్ ఘటన
  • అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం
  • నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్
  • నేడు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిన పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం తీవ్ర రూపు దాల్చింది. పరిస్థితి చూస్తే ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ సర్కార్ అన్నట్టుగా తయారైంది. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయగా, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి బదులిచ్చారు. శాంతిభద్రతలకు సంబంధించిన ఈ ఘటనలో పోలీసుల ప్రస్తావన కూడా ఉండడంతో ఇప్పటికే డీజీపీ స్పందించారు. తాజాగా ఏసీపీ విష్ణుమూర్తి కూడా మీడియాతో మాట్లాడారు. 

"ఓ సినిమా యాక్టర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ఘటన ఒక యాక్సిడెంట్ అని, అందుకు ఎవరూ కారకులు కారని చెప్పారు. ఆయనపై ఎవరికీ పగ లేదు. కానీ ఆయన చేసే పనులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉన్నాయా, లేదా అనేది చూసుకోవాలి. ఆయనేమీ పాలుతాగే పిల్లవాడు కాదు... 40 ఏళ్లు పైబడిన వ్యక్తి. ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఎంత హుందాగా వ్యవహరించాలి? 

ఒక సెలెబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాల గురించి, తన పరిధి గురించి తెలుసుకోవాలి? అసలు... ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టొచ్చా? ఆ అధికారం ఉందా? ఆయన రిమాండ్ ఖైదీ... బెయిల్ పై బయట ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు... ఆయనకే తెలియాలి. తాను, దర్శకుడు సుకుమార్, మరొకరు కలిసి కొంత మొత్తం బాధిత కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ చర్య పరోక్షంగా బాధితులను ప్రలోభానికి గురిచేసినట్టే అవుతుంది. 

నిన్న ఆయన కళ్లలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్ లు పెట్టుకోలేకపోతున్నాననే బాధే కనిపించింది తప్ప, ఆయనలో ఎలాంటి విచారం లేదు. ఆయన తన ఇంటిని ఒక ఫంక్షన్ హాల్ లాగా మార్చేసి, వచ్చేవాళ్లు, పోయేవాళ్లతో ఆయన చాలా హ్యాపీగా గడిపేస్తున్నాడు. 

చట్టం ఎప్పుడూ బాధితుల పక్షానే ఉంటుంది... మరి నువ్వు బాధితుడివా? ఏ రకంగా బాధితుడివి? బాగా పైసలు సంపాదించుకుని, లెక్కలు చూసుకుంటున్నావు... నీపై ఎవరైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నావు" అంటూ ఏసీపీ విష్ణుమూర్తి హీరో అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Allu Arjun
ACP Vishnumurthy
Sandhya Theater incident
Hyderabad

More Telugu News