Loans: అప్పిస్తే జైలుకే: వడ్డీ వ్యాపారాలను నియంత్రించేందుకు కొత్త చట్టం 'బులా'

Government proposes new bill to ban unregulated lending activities all you Need to know about bula
  • రుణ యాప్‌ల కట్టడికి సరికొత్త ప్రతిపాదన చేసిన కేంద్రం
  • అనుమతి లేకుండా రుణాలు ఇచ్చేవారిపై కొరడా ఝులిపించే చట్టం
  • పదేళ్ల వరకు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా
  • ముసాయిదా బిల్లుపై సూచనలు, సలహాలు కోరిన ప్రభుత్వం
లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవసరాలకు అధిక వడ్డీకి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులు లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ (ఆన్‌లైన్) మార్గంలో రుణాలు ఇచ్చే వారికి పదేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు కోటి రూపాయల వరకూ జరిమానా విధించేలా కొత్త బిల్లును ప్రతిపాదించింది. ఇది చట్టంగా మారితే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా పర్మిషన్ లేని వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్‌లు అప్పులు ఇవ్వడం కుదరదు.

అనియంత్రిత రుణ వ్యాపార కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు 2021 నవంబర్ లో తన నివేదికను సమర్పించింది. అనియంత్రిత రుణ కార్యకలాపాలను నిషేధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు పలు చర్యలను వర్కింగ్ గ్రూపు సూచించింది. ఆర్బీఐ లేదా ఇతర నియంత్రణ మండళ్లతో పాటు ఏదైనా చట్ట ప్రకారం రుణ వ్యాపారం కొనసాగించేందుకు అనుమతిలేని వ్యక్తులు లేదా సంస్థలను నిషేధించాలని ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది. 
 
నియంత్రిత రుణాలకు సంబంధించిన ఏ చట్టం పరిధిలోకి రాని భౌతిక, డిజిటల్ లేదా ఇతర మార్గాల్లో నిర్వహించే రుణ కార్యకలాపాలను (బంధువులకిచ్చే రుణాలు మినహా) అనియంత్రిత రుణ వ్యాపారంగా బిల్లు నిర్వహించింది. నియమావళికి విరుద్దంగా రుణాలిచ్చే వారికి కనీసం రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల నుంచి కోటి వరకూ జరిమానా విధించనున్నట్లు బిల్లులో ప్రతిపాదించారు. 

రుణ గ్రహీతలను వేధించడం లేదా అనైతిక పద్ధతుల్లో బకాయిల రికవరీకి పాల్పడే వారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అనియంత్రిత రుణదాత, రుణ గ్రహీతలు, ప్రాపర్టీలు పలు రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పక్షంలో లేదా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే స్థాయి సొమ్ముకు సంబంధించిన కేసును సీబీఐకి బదిలీ చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ (బీయూఎల్ఎ,బులా) పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లుపై 2025 ఫిబ్రవరి 13 నాటికి సూచనలు, అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. 
Loans
BULA
unregulated lending

More Telugu News