Sritej: బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ ఆసుపత్రి

KIMS Hospital releases injured boy Sritej latest health bulletin
  • పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా తొక్కిసలాట
  • సంధ్య థియేటర్ వద్ద ఘటన
  • రేవతి అనే మహిళ మృతి
  • ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆసుపత్రి తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించింది. 

శ్రీతేజ్ కు వెంటిలేటర్ తొలగించామని, వెంటిలేటర్ లేకుండానే శ్రీతేజ్ శ్వాస తీసుకోగలుగుతున్నాడని వివరించింది. శ్రీతేజ్ కు అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, అయితే నిన్నటి కంటే ఇవాళ శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగైందని కిమ్స్ ఆసుపత్రి పేర్కొంది. 

డిసెంబరు 4వ తేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ షోకి హీరో అల్లు అర్జున్ కూడా విచ్చేశారు. 

ఈ క్రమంలో, భారీ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడికి బ్రెయిన్ డ్యామేజి జరిగినట్టు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇటీవల వెల్లడించారు.
Sritej
Health Bulletin
KIMS
Sandhya Theater Incident
Hyderabad

More Telugu News