US Shut down: బైడెన్ సర్కారుకు తప్పిన ‘షట్‌డౌన్’ ముప్పు

US Congress passed spending legislation early on Saturday
  • అర్ధరాత్రి దాటాక యూఎస్ కాంగ్రెస్‌లో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
  • చివరి క్షణంలో పాసైన బిల్లు... తొలగిపోయిన షట్‌డౌన్ గండం
  • ప్రభుత్వ నిర్వహణకు అందనున్న ఉద్దీపన ప్యాకేజీ
అమెరికా ఫెడరల్ ప్రభుత్వాన్ని నడిపించడానికి అవసరమైన కీలక ద్రవ్య వినిమయ బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. శుక్రవారం పొద్దుపోయాక యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఫండింగ్ గడువు ముగిసిన 38 నిమిషాల తర్వాత సెనేట్‌లో ద్రవ్య వినిమయ బిల్లు పాసైంది. డెమోక్రాట్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్న సెనేట్‌లో 85-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.

రిపబ్లికన్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు ఇదివరకే గ్రీన్‌ సిగ్నల్ లభించింది. దీంతో అమెరికా‌కు షట్‌డౌన్ గండం తప్పింది. అధ్యక్షుడు జో బైడెన్ సంతకం పెడితే ఈ బిల్లు చట్టంగా మారిపోతుంది. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన ఉద్దీపన ప్యాకేజీ అందుతుంది.

నిజానికి ఈ బిల్లులు ఇదివరకే ఆమోదం పొందాల్సి ఉంది. కానీ, అమెరికా తదుపరి అధ్యక్షుడిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ బిల్లులో పలు కీలక మార్పులు సూచించారు. దీంతో బిల్లులో మార్పులు చేసి మళ్లీ చట్టసభ ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. ప్రభుత్వ ఫండింగ్ గడువు ముగిసిపోవడానికి కొన్ని గంటల ముందు స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ ఈ కొత్త బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. దీంతో ఉత్కంఠ మధ్య బిల్లు ఆమోదం పొందింది.

బిల్లు పాస్ అవుతుందనే నమ్మకంతో బైడెన్ ప్రభుత్వం ఎలాంటి మధ్యంతర చర్యలు చేపట్టలేదు. కాగా, షట్‌డౌన్ పరిస్థితి తలెత్తి ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడి ఉండేవి.
US Shut down
USA
Donald Trump
Joe Biden

More Telugu News