Supreme Court: ‘ఆ చట్టాలు మీ భర్తలపై ఆయుధాలుగా వాడేందుకు కాదు’.. మహిళలకు సుప్రీంకోర్టు హితవు

Strict laws for womens welfare not to threaten husbands Says Supreme Court
  • వేధింపుల నుంచి మహిళల రక్షణ కోసమే కఠిన చట్టాలు చేశామన్న కోర్టు
  • వివాహం అనేది కమర్షియల్ వెంచర్ కాదని వ్యాఖ్య
  • విడాకుల సమయంలో భరణం రీజనబుల్ గా ఉండాలని సూచన
అత్తింటి వారి వేధింపుల నుంచి రక్షణ కోసం, మీ సంక్షేమం కోసం చేసిన కఠిన చట్టాలను ఆయుధాలుగా మార్చుకోవద్దని సుప్రీంకోర్టు మహిళలకు హితవు పలికింది. ఆ చట్టాలు మీ రక్షణ కోసమే కానీ భర్తలపై ఆయుధాలుగా ప్రయోగించేందుకు కాదని చెప్పింది. వివాహం అనేది కమర్షియల్ వెంచర్ కాదని వ్యాఖ్యానించింది. విడాకుల సమయంలో కోరే భరణం రీజనబుల్ గా ఉండాలే తప్ప విడిపోయిన భర్తను రోడ్డు మీదికి ఈడ్చేలా కాదని పేర్కొంది. ఈమేరకు గురువారం ఓ విడాకుల కేసులో తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నాగరత్న ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వివాహం తర్వాత భర్తపై ఆధారపడిన భార్య.. విడాకుల తర్వాత ఇబ్బంది పడకూడదనే  ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే భరణం అని సుప్రీంకోర్టు పేర్కొంది. మాజీ భాగస్వామి ఆర్థిక స్థాయికి సరిసమానంగా ఉండేలా భరణం నిర్ణయించలేమని స్పష్టం చేసింది. సామజిక పరిస్థితులు, జీవనశైలి ఆధారంగా భరణాన్ని రీజనబుల్ గా నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపింది. ఇటీవల బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

భార్య వేధింపులు, భరణంగా భారీ మొత్తం డిమాండ్ చేయడం, తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పడంతో తీవ్ర ఆవేదనకు గురైన అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన రాసిన ఆత్మహత్య లేఖ, సెల్ఫీ వీడియో దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మహిళల కోసం చేసిన చట్టాలతో మగవాళ్లను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Supreme Court
Welfare Laws
Women Laws
Divorce
Alimony

More Telugu News