V Srinivas Goud: తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు ఆదేశిస్తున్నాం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

TTD chairman BR Naidu orders to take action on Ex minister Srinivas Goud
  • నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీనివాస్ గౌడ్
  • టీటీడీపై విమర్శలు గుప్పించిన వైనం
  • తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమన్న టీటీడీ ఛైర్మన్
టీటీడీ ప్రతిష్ఠతను దెబ్బతీసేలా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు ఆదేశిస్తున్నామని ఆయన తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఎంతటి వారి విషయంలోనైనా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే... ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. 

నిన్న ఉదయం తిరుమల శ్రీవారిని శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీటీడీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. దేవుడు ముందు అందరూ సమానమేనని... వివక్ష చూపడం సరికాదని చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యాపారాల్లో, పదవుల్లో ఎక్కువ లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఛైర్మన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు.
V Srinivas Goud
BRS
TTD

More Telugu News