Noida CEO Dr Lokesh M: పని కోసం వచ్చిన వృద్ధుడిని నిలబెట్టిన అధికారులు.. 20 నిమిషాలు నిలబడి పనిచేయాలని శిక్ష విధించిన సీఈవో

Noida CEO Made Staff Stand For 20 Minutes For Kept Elderly Man Waiting
  • పని కోసం వచ్చిన వృద్ధుడిని నిలబెట్టిన సిబ్బంది
  • ఆయన పనేంటో చూసి పూర్తిచేసి పంపించాలని చెప్పిన సీఈవో
  • 20 నిమిషాల తర్వాత కూడా వృద్ధుడిని నిలబెట్టిన ఉద్యోగులు
  • సిబ్బంది మొత్తానికి 20 నిలబడే పనిష్మెంట్ ఇచ్చిన సీఈవో
పని కోసం వచ్చిన వృద్ధుడిని అకారణంగా నిలబెట్టిన ఉద్యోగులకు నోయిడా సీఈవో 20 నిమిషాలు నిలబడి పనిచేసే శిక్ష విధించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నోయిడాలోని న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రతి రోజూ కొన్ని వందలమంది వివిధ పనుల కోసం సందర్శిస్తూ ఉంటారు. 2005 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ లోకేశ్ గతేడాది దీనికి సీఈవోగా నియమితులయ్యారు. సిబ్బంది పనుల పర్యవేక్షణ కోసం కార్యాలయంలో దాదాపు 65 సీసీ కెమెరాలు బిగించారు. ఈ కెమెరాల ద్వారా సీఈవో  ప్రతిరోజూ సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్రమంలో సోమవారం వాటిని పరిశీలిస్తుండగా పని కోసం వచ్చిన ఓ పెద్దాయన ఓ ఉద్యోగి డెస్క్ ముందు నిలబడి ఉండటం చూశారు. వెంటనే మహిళా ఉద్యోగిని పిలిచి ఆ వృద్ధుడు దేని కోసం వచ్చాడో కనుక్కుని ఆ పని అయితే అవుతుందని, లేదంటే లేదని చెప్పి పంపించి వేయాలని, ఇలా నిలబెట్టడం మంచిది కాదని సూచించారు.  

అయితే, 20 నిమిషాల తర్వాత కూడా ఆ పెద్దాయన అదే డెస్క్ ముందు నిలబడి ఉండటాన్ని చూసిన సీఈవో ఉద్యోగుల పనితీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారి వద్దకు వచ్చి నిర్లక్ష్యానికి శిక్ష అనుభవించాల్సిందేనంటూ అందరూ ఎవరి డెస్క్‌ల వద్ద వారు 20 నిమిషాల పాటు నిలబడి పనిచేయాలని ఆదేశించారు. ఉద్యోగులు నిలబడి పనిచేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అయింది. 

సీఈవో పనిష్మెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సీఈవో ప్రతి కార్యాలయంలోనూ ఉండాలని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నిరక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సీఈవో దొరికారని కొనియాడుతున్నారు.
Noida CEO Dr Lokesh M
New Okhla Industrial Development Authority
Noida
Offbeat

More Telugu News