Canada: కెనడాలో ట్రూడో సర్కారుకు ఎదురుదెబ్బ... ఉప ప్రధాని రాజీనామా

canada finance minister chrystia freeland resigns from cabinet
  • కెనడా ప్రధాని ట్రూడోకు షాక్ ఇచ్చిన ఉప ప్రధాని క్రిస్టియా
  • ట్రూడో కేబినెట్‌లో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపు ఉన్న క్రిస్టియా
  • ప్రధానిపై సంచలన ఆరోపణలు చేసిన క్రిస్టియా
కెనడా రాజకీయాల్లో భారీ సంచలనం చోటుచేసుకుంది. ఆ దేశ ఉప ప్రధాని, ఆర్ధిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేశారు. జస్టిన్ ట్రూడో కేబినెట్‌లో అత్యంత శక్తిమంతురాలిగా పేరొందిన క్రిస్టియా రాజీనామా చేయడం హాట్ టాపిక్ అయింది. 

ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నాడని ఆమె ఆరోపించడం తీవ్ర సంచలనం అయింది. తన రాజీనామాకు కారణం ఇదేనని పేర్కొన్నారు. ఆయితే, ఆమె నిర్వహిస్తున్న ఆర్ధిక శాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పిన నేపథ్యంలో క్రిస్టియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
కెనడా ప్రభుత్వం నేడు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని, మరో వైపు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరిస్తున్నారని, అటువంటి ముప్పును మనం తీవ్రంగా పరిగణించాలని రాజీనామా లేఖలో క్రిస్టియా ఫ్రీలాండ్ పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా ఉత్తమ మార్గాల కోసం అన్వేషించామని, ఈ క్రమంలో తమ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని ఆమె పేర్కొన్నారు. అయితే తాను లిబరల్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో టొరంటో నుంచి మళ్లీ పోటీ చేస్తానని క్రిస్టియా వెల్లడించారు. 

క్రిస్టియా 2013లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అనంతరం అధికారం చేపట్టిన ట్రూడో కేబినెట్‌లో చేరారు. వాణిజ్య , విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2020 ఆగస్టు నుంచి ఆర్ధిక మంత్రిగా ఆమె కొనసాగుతున్నారు. అయితే, దేశ ఆర్ధిక సవాళ్లకు సంబంధించిన విషయాలను పార్లమెంట్‌కు నివేదించనున్న కొన్ని గంటల్లోనే క్రిస్టియా తన పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది.
Canada
finance minister chrystia freeland
resigns

More Telugu News