Congress: ఈవీఎంల ఇష్యూ... ఒమర్ అబ్దుల్లాపై కాంగ్రెస్ నేత మాణికం ఠాకూర్ ఆగ్రహం

Congress hits back at Omar after he defends EVMs
  • ఒమర్ అబ్దుల్లా సీఎం అయ్యాక అభిప్రాయం ఎందుకు మారిందోనన్న కాంగ్రెస్ నేత
  • కూటమిలోని పలు పార్టీలు బహిరంగంగా ఈవీఎంలపై మాట్లాడాయని వెల్లడి
  • కాంగ్రెస్ బయట మాట్లాడలేదన్న మాణిక్కం ఠాకూర్
ఈవీఎంల విషయంలో తమ ఆరోపణలను జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మాటతీరు మారిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాణికం ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అయ్యాక ఈవీఎంల విషయంలో ఆయన అభిప్రాయం ఎందుకు మారిందో చెప్పాలన్నారు. 

ఈవీఎంల పనితీరుపై కూటమిలోని సమాజ్‌వాది పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) కూడా బహిరంగంగానే మాట్లాడాయని మండిపడ్డారు. కానీ తాము (కాంగ్రెస్) మాట్లాడలేదన్నారు. ఒమర్ అబ్దుల్లా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ తాము సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానాన్ని కేవలం సీఈసీకి మాత్రమే ఇచ్చామన్నారు.

ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండి కూడా ఒమర్ అబ్దుల్లా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారోనని మాణికం ఠాకూర్ అన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి దారుణంగా ఓడిపోయింది. దీంతో కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈవీఎంలపై మరోసారి అనుమానం వ్యక్తం చేశాయి. 

ఈవీఎంలు హ్యాకింగ్ అంటూ ఆరోపణలు చేయడాన్ని ఒమర్ అబ్దుల్లా ఖండించారు. మీ పార్టీ గెలిచినప్పుడు విజయంగా చెప్పి, తర్వాత అనుకున్న ఫలితాలు రానప్పుడు ఈవీఎంలపై ఆరోపణలు చేయడమేమిటని ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. ఓటింగ్ విధానంపై విశ్వాసం లేకుంటే ఎన్నికలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మాణికం ఠాకూర్ స్పందించారు.
Congress
EVM
BJP
Omar Abdullah

More Telugu News