Allu Arjun: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్

BRS MLA Kaushik Reddy condemned the arrest of Allu Arjun
  • అల్లు అర్జున్ చేసిన తప్పేమిటి?
  • అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?
  • రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించిన హుజురాబాద్ ఎమ్మెల్యే
  • కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే అగ్నిగుండమేనని హెచ్చరిక
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడాన్ని విపక్ష బీఆర్ఎస్ తప్పుబడుతున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ నిన్న (శుక్రవారం) అరెస్టును ఖండించారు. ఇవాళ (శనివారం) తాజాగా ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా స్పందించారు. అల్లు అర్జున్‌ చేసిన తప్పేమిటని, ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కోర్టు బెయిల్ ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత కూడా రాత్రంతా జైలులోనే అల్లు అర్జున్‌ను ఉంచాల్సిన అవసరం ఏముందని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ చేయాల్సింది అల్లు అర్జున్‌ను కాదని, సీఎం రేవంత్‌ రెడ్డిని అరెస్ట్ చేయాలని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన హుజురాబాద్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్ సర్కారుపై ఈ సందర్భంగా ఆయన విమర్శలు గుప్పించారు.

కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే అగ్నిగుండమే
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రమంతా అగ్నిగుండంగా మారుతుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ నాయకులను రాష్ట్రంలో తిరగనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం ‘టెస్లా’ కంపెనీని హైదరాబాద్‌కి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నగరానికి ఫార్ములా రేస్‌ను కేటీఆర్ తీసుకొచ్చారని, దానిని రద్దు చేసిన రేవంత్‌ రెడ్డిని అరెస్ట్ చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Allu Arjun
Allu Arjun Arrest
Movie News
Tollywood
Padi Kaushik Reddy

More Telugu News