Revanth Reddy: అల్లు అర్జున్ ఏమైనా భారత్-పాకిస్థాన్ బోర్డర్లో యుద్ధం చేశాడా?: రేవంత్ రెడ్డి

Revanth Reddy severe comments on Allu Arjun arrest issue
  • ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి
  • అల్లు అర్జున్ అరెస్ట్ పై ఆజ్ తక్ కార్యక్రమంలో ఘాటు వ్యాఖ్యలు
  • అల్లు అర్జున్ సినిమా చూసి వెళ్లిపోతే ఇలా జరిగేది కాదని వెల్లడి
  • కార్లోంచి బయటికి వచ్చి అభివాదం చేయడంతో తొక్కిసలాట జరిగిందన్న సీఎం
ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజ్ తక్ చానల్ కార్యక్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది వ్యాపారం, డబ్బు పెడతారు.... డబ్బులు సంపాదించుకుంటారు... రియల్ ఎస్టేట్ లో చూడడం లేదా...! అల్లు అర్జున్ కూడా అంతే! అల్లు అర్జున్ ఏమైనా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధం చేశాడా? అంటూ వ్యాఖ్యానించారు. 

అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, తాను కూడా అల్లు అర్జున్ కు తెలుసని రేవంత్ రెడ్డి తెలిపారు. అల్లు అర్జున్ కుటుంబం కూడా తనకు తెలుసని వివరించారు. అల్లు అర్జున్ మామయ్య చిరంజీవి కాంగ్రెస్ నేత... అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడే... నాకు బంధువు కూడా... ఆ లెక్కన అల్లు అర్జున్ భార్య మా ఇంటి ఆడపడుచే అవుతుంది అని వ్యాఖ్యానించారు. 

కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కేసు పెట్టకపోతే... ఉద్దేశపూర్వకంగానే వదిలేశారంటారని, నటుడు కాబట్టే కేసు పెట్టలేదంటారని వెల్లడించారు. ఈ కేసులో తన జోక్యం ఏమీ లేదని, పోలీసులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటారని అన్నారు. 

ఆ రోజున బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చింది తామేనని... రూ.300 టికెట్ ను రూ.1300 చేసుకునేలా అనుమతి కూడా ఇచ్చామని అన్నారు. కానీ అల్లు అర్జున్ సినిమా చూసి వెళ్లిపోకుండా కార్లోంచి బయటికి వచ్చి అందరికీ అభివాదం చేశాడని, దాంతో అక్కడ తొక్కిసలాట జరిగిందని చెప్పారు. అందుకే అల్లు అర్జున్ ఈ కేసులో ఏ11 గా పేర్కొన్నామని... ఈ కేసులో ఏ1, ఏ2లు వేరే వాళ్లు ఉన్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

అల్లు అర్జున్ కారణంగా ఒక తల్లి మరణించింది... ఆమె బిడ్డ కోమాలో ఉన్నాడు... రేపు ఆ బిడ్డ నా తల్లి ఏదని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడంటూ ఎవరైనా అనుమతి తీసుకోకుండా నిరసన తెలిపితే వాళ్లను కూడా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
Revanth Reddy
Allu Arjun
Arrest
Congress
Hyderabad
Telangana

More Telugu News