10th Class Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల... ఎప్పట్నుంచి అంటే...!

AP Education Minister Nara Lokesh releases 10th and Inter exmas schedule
  • మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు
  • మార్చి 17 నుంచి టెన్త్ పరీక్షలు
  • ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఏపీలో 10వ తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1న ప్రారంభం కానున్నాయి. 

టెన్త్ పరీక్షలు మార్చి 17 నుంచి మార్చి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు జరగనున్నాయి.

ఇంటర్ లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. 

ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

విద్యార్థులకు విషెస్ తెలిపిన నారా లోకేశ్

టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. "డియర్ స్టూడెంట్స్... ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజైంది. పరీక్షలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం కండి. ఒత్తిడిని దరిచేరనివ్వవద్దు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. పరీక్షలను మీ శక్తిమేర రాయండి. అందరూ చక్కగా చదివి పాసవ్వాలని కోరుకుంటున్నాను" అంటూ ఇంటర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇక పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి కూడా నారా లోకేశ్ సందేశం వెలువరించారు. "పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. మీరు సరిగ్గా ప్రిపేర్ కావడానికి, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి వీలుగా... వరుసగా కాకుండా, ప్రత్యామ్నాయ దినాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ మేరకు లభించిన అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకుని, బాగా చదివి అద్భుతమైన మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా నా పదో తరగతి తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్" అంటూ లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
10th Class Exams
Inter Exams
Nara Lokesh
Schedule
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News