Supreme Court: వేధింపుల నుంచి రక్షణ కోసం చేసిన చట్టాన్ని కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తున్నారు: సుప్రీంకోర్టు

Cruelty law being misused for personal vendetta against husband says Supreme Court
  • ఐపీసీ సెక్షన్ 498 ఏని దుర్వినియోగం చేస్తున్నారని అసహనం
  • భర్త, భర్త కుటుంబంపై కక్ష సాధించేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపాటు 
  • ఓ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు తీరును తప్పుబట్టిన సుప్రీం
అత్తవారింట్లో భర్త, భర్త కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ఉద్దేశించిన చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భర్తపై, భర్త కుటుంబంపై వ్యక్తిగత కక్ష సాధించడం కోసం 498 ఏ సెక్షన్ కింద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడింది. పోలీసులు, యంత్రాంగం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత కక్ష సాధింపులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొంది. ఈమేరకు తెలంగాణకు సంబంధించిన ఓ కేసు విచారణలో భారత అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

వివాహాన్ని రద్దు చేయాలంటూ తాను కోర్టుకెక్కితే భార్య తనపై వేధింపుల కేసు పెట్టిందని, తప్పుడు ఉద్దేశంతో కక్ష సాధింపు కోసం పెట్టిన ఈ కేసును కొట్టేయాలని తెలంగాణ వ్యక్తి సుప్రీంను ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ ను కొట్టేయడంతో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ల ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు తీరును తప్పుబట్టింది. వ్యక్తిగత కక్ష సాధింపు కోసమే పెట్టిందని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కేసు కొట్టేయడానికి నిరాకరించడం తప్పిదమని వ్యాఖ్యానించింది.

ఐపీసీ సెక్షన్ 498 ఏ లేదా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 86ను భర్త తరపువాళ్లపై కక్ష సాధించేందుకు భార్య ఓ ఆయుధంగా మార్చుకుంటోందని విమర్శించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరుగుతుండడంపై సుప్రీం బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. నిరాధార ఆరోపణలతో అమాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా చేసే ఇలాంటి ఫిర్యాదుల ఆధారంగా భర్తను, భర్త కుటుంబ సభ్యులను ప్రాసిక్యూట్ చేయడం తగదని, ఈ తరహా ఫిర్యాదుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసు యంత్రాంగానికి సుప్రీంకోర్టు సూచించింది.

ఏమిటీ ఐపీసీ సెక్షన్ 498 ఏ..
భర్త, భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడిన సందర్భాలలో భార్యకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించినదే ఐపీసీ సెక్షన్ 498 ఏ లేదా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 86.. ఈ సెక్షన్ ప్రకారం.. వరకట్నం కోసం, అదనపు కట్నం కోసం లేదా మరేదైనా కారణంతోనో భార్యలపై భర్త, భర్త కుటుంబ సభ్యులు శారీరక, మానసిక వేధింపులకు పాల్పడితే ఐపీసీ 498 ఏ, బీఎన్ఎస్ 86 ప్రకారం కేసు నమోదు చేయవచ్చు. ఈ కేసుల్లో దోషిగా తేలితే భర్త, భర్త కుటుంబ సభ్యులకు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద నమోదు చేసిన కేసుల్లో బెయిల్ పొందే వీలులేదు. ఇది నాన్ బెయిలబుల్ కేసు.
Supreme Court
IPC 498a
BNS 86
Cruelty
Vendetta
Wife Case
Husband Family

More Telugu News