Jagan: ఈ స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది: జగన్

Jagan responds on Mega Parent Teacher Meetings held by alliance govt
  • నిన్న రాష్ట్రంలో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు
  • తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ అధినేత జగన్
  • పేరెంట్-టీచర్ సమావేశాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయని వెల్లడి
  • కూటమి ప్రభుత్వం పేరుమార్చి ప్రచారం చేసుకుంటోందని ఆగ్రహం
  • సిగ్గనిపించడం లేదా? అంటూ ఫైర్ 
ఏపీలో కూటమి ప్రభుత్వం నిన్న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ నిర్వహించడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలు జరగడం సాధారణమైన విషయం అని, కానీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ సమావేశాల పేరు మార్చి ఆ మీటింగ్స్ ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా ప్రచారం చేసుకుంటోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని జగన్ తెలిపారు.

వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను ఎంతో కష్టపడి తీర్చిదిద్దామని... కానీ ఆ స్కూళ్లను, విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాశారని, వారిని మోసం చేయడమే కాకుండా, రొటీన్ గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై వారితో పబ్లిసిటీ చేయించుకుంటున్నారని జగన్ విమర్శించారు. ఈ ప్రపంచంలో చంద్రబాబు మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలరని, ఇంతటి నటనా కౌశలం చంద్రబాబుకే సొంతం అని ఎద్దేవా చేశారు. 

"విద్యార్థులు-టీచర్లు-తల్లిదండ్రులతో సమావేశాలు కొత్త కాదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో అమలు చేసిన ప్రతి విప్లవాత్మక మార్పులో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకున్నాం. కానీ, ఈ సమావేశాలకు కొత్త పేర్లు పెట్టి తామేదో కొత్తగా చేస్తున్నామని చంద్రబాబు, ఇతర నేతలు భ్రమలు కల్పిస్తున్నారు. అంతేకాదు... పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు, వస్తు సామగ్రిని తీసుకోవాలని ఏకంగా సర్క్యులర్ పంపడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. 

మేం అమలు చేసిన అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారు. నిన్నటి పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యారంగాన్ని దిగజార్చారు. కావాలనే సమస్యలు సృష్టించి, ఉద్దేశపూర్వకంగా పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేలా చేస్తున్నారు. తద్వారా వారి తల్లిదండ్రులపై ఆర్థికభారం మోపుతున్నారు. ఇప్పుడే అదే పిల్లల ముందుకు, తల్లిదండ్రుల ముందుకు వెళ్లి ఏమార్చే మాటలు చెప్పడానికి, వారిని మభ్యపెట్టడానికి సిగ్గేయడంలేదా?" అంటూ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఓ భారీ ట్వీట్ చేశారు.
Jagan
Mega Parent Teacher Meetings
Chandrababu
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News