Velama: షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి: వెలమ సంఘం డిమాండ్

Velama Sangam leaders complaint on Shad Nagar MLA
  • వెలమలను చంపుతాం, చంపేస్తామని బెదిరిస్తూ మాట్లాడారని ఎమ్మెల్యేపై ఆగ్రహం
  • దోమల్‌గూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెలమ సంఘం నేతలు
  • 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి
కాంగ్రెస్ నేత, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌పై ఆలిండియా వెలమ సంఘం హైదరాబాద్‌లోని దోమల్‌గూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం వెలమ సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ... వెలమ సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో దూషించారని, 24 గంటల్లో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు.

ఈ మేరకు వారు మాట్లాడుతూ... వెలమ జాతిపై షాద్ నగర్ ఎమ్మెల్యే దారుణ వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెలమ జాతిని తొక్కేస్తామని, చంపేస్తామని బెదిరించారని, ఇలాంటి మాటలు సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎమ్మెల్యే అన్ని వర్గాలను సమానంగా చూడాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షమాపణ చెప్పకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ కొడతామంటూ సవాల్ చేస్తున్నారని... ఎక్కడకు రమ్మంటారని వెలమ సంఘం యువ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై 13 మంది వెలమ ఎమ్మెల్యేలు స్పందించాలన్నారు. వెలమ నేతలు రాజకీయాలు వేరు... వెలమ కులం వేరని గుర్తించాలన్నారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. 
Velama
Telangana
BRS
Congress

More Telugu News