Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy says will invites KCR to Telangana Thalli statue inauguration
  • కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని కూడా ఆహ్వానిస్తామన్న ముఖ్యమంత్రి
  • ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదని వ్యాఖ్య
  • కేసీఆర్ సభకు వచ్చి సూచనలివ్వాలని విజ్ఞప్తి
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానిస్తామని, మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి ఆయనను ఆహ్వానిస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని కూడా ఆహ్వానిస్తామన్నారు. ఈ నెల 9న విగ్రహావిష్కరణ ఉంటుందన్నారు. మనలో తమిళనాడు స్ఫూర్తి లోపించిందని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదని, 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం అవుతుందన్నారు. ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని... ఆయన తన చతురతతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని సూచించారు. కేసీఆర్ గారూ... అసెంబ్లీ సమావేశాలకు రండి, సూచనలు ఇవ్వండని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

మీ పిల్లలు తప్పు చేస్తే సర్ది చెప్పాలి

కుటుంబ పెద్దగా మీ పిల్లలు (బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి) తప్పు చేస్తే వారికి సర్ది చెప్పాలని సూచించారు. కేసీఆర్ సభకు వచ్చి పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కేసీఆర్ ఇష్టపడ్డా... లేకున్నా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంచి సంప్రదాయం ఉండేదని, సభలో కొన్ని అంశాలపై చర్చించి ఆ తర్వాత ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా అప్పటి మంత్రులను కలిసి... నిధులు రాబట్టుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. 

కానీ తెలంగాణ వచ్చాక గత పదేళ్లు అలాంటి అవకాశం లభించలేదన్నారు. కనీసం సీఎం సచివాలయానికి కూడా రాలేదన్నారు. ప్రజలు అన్నీ గమనించి బీఆర్ఎస్‌ను అధికారానికి దూరం చేశారన్నారు. ఇప్పటికైనా వారి ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. మీ పిల్లలిద్దర్నీ మా పైకి ఉసిగొల్పి ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించారు. తాము ఎవరినో నిందించుకుంటూ కాలం గడపడం లేదని... ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వెళుతున్నామన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రిప్రజెంటేషన్ ఇచ్చి సమస్యలపై చర్చించే వారని, వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో ప్రభుత్వానికి సూచనలు చేశారన్నారు. లోపాలను సరిదిద్దుకోవాలని ప్రతిపక్షాలు చెప్పాలన్నారు. కానీ వారు సభకే రావడం లేదన్నారు. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, దీనికి సంబంధించి ఏమైనా సూచనలు ఉంటే అక్కడ చెప్పాలన్నారు.

కాగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన వారికే ప్రభుత్వం ఇల్లు చెందాలనేది తమ లక్ష్యమన్నారు.
Revanth Reddy
Congress
Telangana
KCR

More Telugu News