Virat Kohli: బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ బ్యాటింగ్... వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

Virat Kohli vs Jasprit Bumrah In Nets and Video gone Viral
  • అడిలైడ్ టెస్టుకు ముందు ప్రాక్టీస్ చేసిన భారత ఆటగాళ్లు
  • బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన విరాట్ కోహ్లీ
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
వరల్డ్ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్లలో విరాట్ కోహ్లీ ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రపంచ మేటి బౌలర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో నిలుస్తాడు. మరి వీరిద్దరూ పరస్పరం ఎదురుపడితే?... బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది?... ఆ సీన్ ఎలా ఉంటుంది?... అనేది అత్యంత ఆసక్తికరం. 

వీరిద్దరూ పరస్పరం తలపడే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ను చూడాలని సగటు క్రికెట్ అభిమానులు కోరుకుంటుంటారు. అలాంటి వారి కోసం ‘స్టార్ స్పోర్ట్స్’ ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది.

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా మొదలు కానున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విరాట్‌కు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేశాడు. నిప్పులు చెరిగే బంతులను బుమ్రా సంధించగా... కోహ్లీ డిఫెన్స్ ఆడాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేయడాన్ని భారత శిబిరంలోని మిగతా ఆటగాళ్లందరూ చూస్తుండడం వీడియోలో కనిపించింది. కాగా వీరిద్దరూ ప్రాక్టీస్ సెషన్‌లో ఒకరినొకరు ఎదుర్కోవడానికి ఇష్టపడరు. అయితే ఐపీఎల్‌లో పరస్పరం ఎదురుపడిన పలు సందర్భాలను అభిమానులు ఆస్వాదించిన విషయం తెలిసిందే.
Virat Kohli
Jasprit Bumrah
Cricket
Sports News
Team India
Viral Videos

More Telugu News