Chinmoy Krishnadas: దారుణం... బంగ్లాదేశ్ లో చిన్మయ్ కృష్ణదాస్ కేసు వాదించడానికి ముందుకు రాని న్యాయవాదులు!

No advocate come for Chinmoy Krishnadas in Bangladesh court
  • బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ఆధ్మాత్మిక గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్
  • చిన్మయ్ తరఫున న్యాయవాది లేకుండానే ముగిసిన నేటి విచారణ
  • తదుపరి విచారణ జనవరి 2కి వాయిదా
  • ఇటీవల చిన్మయ్ న్యాయవాది రీగన్ ఆచార్యపై తీవ్ర దాడి
  • దాంతో భయపడుతున్న ఇతర న్యాయవాదులు
బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానపరిచాడన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దారుణం ఏమిటంటే... ఇవాళ ఆయన కేసు కోర్టులో విచారణకు రాగా... బంగ్లాదేశ్ లో ఒక్క న్యాయవాది కూడా ఆయన తరఫున వాదించేందుకు ముందుకు రాలేదు. 

కొన్ని రోజుల కిందట చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన తరఫున న్యాయవాది రీగర్ ఆచార్య కోర్టులో వాదనలు వినిపించారు. దాంతో, రీగన్ ఆచార్యపై కొందరు వ్యక్తులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. రీగన్ ఆచార్యను బాగా కొట్టడంతోపాటు, ఆయన ఛాంబర్ ను కూడా ధ్వంసం చేశారు. 

ఈ నేపథ్యంలో, ఇవాళ చిన్మయ్ కృష్ణదాస్ కేసు విచారణకు రాగా, న్యాయవాదులు ఎవరూ ఆయన తరఫున వాదించేందుకు సాహసం చేయలేకపోయారు. విచారణ అనంతరం బంగ్లాదేశ్ కోర్టు తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. 

దీనిపై పశ్చిమ బెంగాల్ ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధారమణ్ దాస్ స్పందించారు. బంగ్లాదేశ్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించిన న్యాయవాది రీగన్ ఆచార్యపై కిరాతకంగా దాడి చేశారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకొస్తాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

చిన్మయ్ కృష్ణదాస్ కు అండగా నిలిచిన రమేశ్ రాయ్ అనే ఇంకో న్యాయవాదిపైనా, మరో మద్దతుదారుడిపైనా దాడి జరిగిందని రాధారమణ్ దాస్ వెల్లడించారు. అంతేకాదు, దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలైన న్యాయవాది ఫొటోను కూడా పంచుకున్నారు. ఇప్పుడా న్యాయవాది చావుబతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు.


Chinmoy Krishnadas
Advocate
Bangladesh Court
ISKCON
India

More Telugu News