Digital Arrest: డిజిటల్ అరెస్ట్ పేరుతో యువతి బట్టలు విప్పించి నగదు కాజేసిన కేటుగాళ్లు.. ముంబైలో ఘటన

Mumbai Woman Made To Strip Duped Of One And Half Lakh In Digital Arrest Shocker
  • మనీలాండరింగ్ కేసులో పేరుందని బెదిరింపులు
  • రూ.1.78 లక్షలు బదిలీ చేయించుకున్న వైనం
  • పోలీసులను ఆశ్రయించిన ముంబై యువతి
మనీలాండరింగ్ కేసులో మీ పేరుందంటూ ఓ యువతిని బెదిరించిన కేటుగాళ్లు ఆమె ఖాతాలో నుంచి రూ.1.78 లక్షలు కొట్టేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఇంట్లో అయితే డిస్ట్రబెన్స్ అవుతుందంటూ యువతిని హోటల్ లో రూమ్ తీసుకుని ఆన్ లైన్ లో విచారణకు హాజరు కావాలని బెదిరించారు. బాడీ చెకప్ పేరుతో బట్టలు విప్పించి నగ్నంగా కూర్చోబెట్టారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.

ముంబైలోని బోరీవాలి ఈస్ట్ కు చెందిన ఓ యువతికి నవంబర్ 19న ఓ కాల్ వచ్చింది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ దుండగులు ఆమె పేరు, ఇతరత్రా వివరాలు చెప్పారు. ప్రస్తుతం జైలులో ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేశ్ గోయెల్ కేసులో మీ పేరు కూడా ఉందని చెప్పారు. మనీలాండరింగ్ కేసు నమోదైందంటూ ఆ యువతిని బెదిరించారు. ఆపై వాట్సాప్ వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, విచారణకు సహకరించాలని కోరారు. ఇంట్లో ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఏదైనా హోటల్ లో రూమ్ తీసుకోవాలని సూచించడంతో అప్పటికే బెదిరిపోయిన యువతి దుండగులు ఆదేశాలను పాటించింది.

హోటల్ రూమ్ లో బాడీ చెకప్ చేయాలని యువతి దుస్తులు విప్పించారు. ఆపై సెక్యూరిటీ వెరిఫికేషన్ కోసమని చెప్పి రూ.1.78 లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. వివరాలన్నీ మరోమారు పరిశీలించిన తర్వాత మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పి కాల్ కట్ చేశారు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా జరిగిన మోసం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, ఇలాంటి ఫోన్ కాల్స్ కు భయపడకుండా సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Digital Arrest
Mumbai Woman
Striped
Duped
Crime News
Cybercrime

More Telugu News