Team India: పాక్ చేతిలో టీమిండియా యువ జట్టు ఓటమి.... 1 పరుగుకే అవుటైన కోటి రూపాయల టీనేజర్
- దుబాయ్ లో ఆసియా కప్ అండర్-19 టోర్నీ
- నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్
- 43 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా అండర్-19 జట్టు
ఆసియా కప్ అండర్-19 టోర్నీలో భారత కుర్రాళ్లు ఓటమితో ప్రస్థానం ప్రారంభించారు. ఇవాళ పాకిస్థాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో టీమిండియా అండర్-19 జట్టు 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో... పాక్ యువ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. అనంతరం, 282 పరుగుల లక్ష్యఛేదనలో భారత కుర్రాళ్లు 47.1 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌట్ అయ్యారు. నిఖిల్ కుమార్ 67 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇటీవల ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల పిన్న వయసు ఆటగాడు వైభవ్ సూర్యవంశి నేటి మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఓపెనర్ గా బరిలో దిగిన ఈ బీహార్ టీనేజర్ 9 బంతులాడి చేసింది ఒక్క పరుగే.
వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ వేలంలో రూ.1.10 కోట్ల ధర పలికాడు. ఈ యంగ్ క్రికెటర్ కనీస ధర రూ.30 లక్షలు కాగా... రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అతడిని కోటి రూపాయలకు పైగా ధరతో కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసు క్రికెటర్ గానే కాకుండా, చిన్న వయసులోనే కోటి రూపాయల చెక్ అందుకున్న ఐపీఎల్ క్రికెటర్ గానూ వైభవ్ సూర్యవంశి రికార్డు పుటల్లోకెక్కాడు.
దాంతో, ఇవాళ పాకిస్థాన్ తో ఆసియా కప్ అండర్-19 మ్యాచ్ కు ముందు అతడిపై భారీ హైప్ నెలకొంది. సూర్యవంశి ఎలా ఆడతాడన్నదానిపై సర్వత్రా ఆసక్తి చూపారు. కానీ, అతడు కాసేపు కూడా క్రీజులో నిలవలేకపోయాడు.
ఇక, టీమిండియా అండర్-19 టీమ్ లో ఓపెనర్ ఆయుష్ మాత్రే 20, ఆండ్రీ సిద్ధార్థ్ 15, కెప్టెన్ మహ్మద్ అమాన్ 16, కిరణ్ కార్మోలే 20, హర్ వంశ్ పంగాలియా 26, మహ్మద్ ఇనాన్ 30 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అలీ రెజా 3, అబ్దుల్ సుభాన్ 2, ఫహామ్ ఉల్ హక్ 2, నవీద్ అహ్మద్ ఖాన్ 1, ఉస్మాన్ ఖాన్ 1 పరుగు చేశారు.