Sridhar Babu: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం అందించనుంది: శ్రీధర్ బాబు

Sridhar Babu says Israel to give technology support to Telangana
  • ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్న మంత్రి
  • రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఆసక్తి
  • సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి
  • మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఇజ్రాయెల్ రాయబారి
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఇజ్రాయెల్ ముందుకు వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు ఆ దేశ రాయబారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఆసక్తి కనబరచడం సంతోషంగా ఉందన్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని మంత్రి కోరారు.

రక్షణ రంగం, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటును అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు.

తెలంగాణలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని శ్రీధర్ బాబు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీపై అత్యాధునిక శిక్షణలో ఇజ్రాయెల్ మద్దతు కావాలని కోరారు. వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికతతో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇజ్రాయెల్ నుంచి పరిశ్రమలు పెట్టేందుకు ఏ సంస్థ ముందుకొచ్చినా నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉంటాయన్నారు. నూతన పరిజ్ఞానం, పరిశ్రమల ఏర్పాటులో సాయపడితే తెలంగాణ నుంచే ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చన్నారు.
Sridhar Babu
Israel
Telangana

More Telugu News