AP Police: రఘురామ కృష్ణరాజుపై చిత్ర హింసల కేసు .. విజయపాల్ కస్టడీకి పోలీసుల పిటిషన్
- గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
- పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
- కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్న విజయపాల్ తరపు న్యాయవాది
మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణరాజుపై చిత్రహింసల కేసులో సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బయిల్ మంజూరుకు నిరాకరించిన నేపథ్యంలో ఇటీవల పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ క్రమంలో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గురువారం గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జి.స్పందన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. ఈ కేసులో విజయపాల్ కీలకపాత్ర పోషించారని, విచారణకు సహకరించలేదని, కీలక సమాచారాన్ని ఇవ్వకుండా విచారణను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని పోలీసులు ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
ఆయనను మరింత విచారించి ఈ కేసులో కుట్రకోణంలో పాటు హత్యాయత్నం చేసిన విధానాన్ని కనుగొనాల్సి ఉందని పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. విజయపాల్ తరపున న్యాయవాది దీనిపై తాము కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు.