BJP: ఒవైసీ బ్రదర్స్ సువిశాల నిర్మాణాల్ని మాత్రం రేవంత్ రెడ్డి కూల్చడం లేదు: బీజేపీ నేత

BJP leader Boora Narsaiah Goud says Revanth Reddy is demolition cm
  • హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి వారి ఇళ్లను కూల్చేస్తున్నాడని విమర్శ
  • హైడ్రా, మూసీ ప్రక్షాళన, ఫార్మా పేరుతో భూములు లాక్కుంటున్నారని ఆరోపణ
  • మూసీ కంటే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూచన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్లను కూల్చేస్తున్నాడని, కానీ కాంగ్రెస్ ఉన్నత వర్గం, వారి బీఆర్ఎస్ మిత్రపక్షం, ఒవైసీ సోదరుల విశాలమైన అక్రమ నిర్మాణాలను, రాజభవనాల వంటి ఫాంహౌస్‌లను మాత్రం కూల్చడం లేదని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన, భూసేకరణ, రహదారుల పేరుతో ఫార్మా కంపెనీల పేరుతో భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు.

మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ నిర్వాసితులకు న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మూసీ ప్రక్షాళన చేపట్టినా దానిని పూర్తి చేసేది మాత్రం తమ బీజేపీ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు.

అయితే మూసీ ప్రక్షాళన కంటే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. కులగణన నివేదిక రాగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. 

వివిధ రాష్ట్రాల్లో వరుస ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందన్నారు. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ సర్వేలకు భిన్నంగా విజయం సాధించిందన్నారు. ఝార్ఖండ్, జమ్ము కశ్మీర్‌లలో తమకు ఓటు బ్యాంకు పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలలో 50 సీట్లు కూడా గెలవలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని విమర్శించారు.

రేవంత్ రెడ్డి డిమోలిషన్ మ్యాన్ అని, అంటే కూల్చివేతల మనిషి అని బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ పరిస్థితి పెనం నుంచి పొయ్యి మీద పడినట్లయిందని వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి... ప్రజలను మోసం చేసిందన్నారు.
BJP
Boora Narsaia Goud
Revanth Reddy

More Telugu News