Nadendla Manohar: రైతు సేవా కేంద్రాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల

Minister Nadendla Manohar visits Rythu Seva centers in Krishna district
  • కృష్ణా జిల్లాలో మంత్రి నాదెండ్ల పర్యటన
  • 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వెల్లడి
  • 24 గంటల్లోపు నగదు జమ చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామని వివరణ
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం లో పునాదిపాడు, కోలవెన్ను రైతు సేవా కేంద్రాలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు విషయంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే కనీవినీ ఎరుగని రీతిలో ఈ సంవత్సరంలో నాలుగు లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం పూర్తయిందని వెల్లడించారు. వర్షాలు, తుపాను వచ్చే పరిస్థితి కనపడటం వల్ల రైతులు ఆవేదన చెందుతున్న సందర్భంలో మిల్లుల వద్దకు హడావిడిగా తరలించే ప్రయత్నంలో గోతాలు కానివ్వండి, లారీ ట్రాన్స్ పోర్ట్ కానివ్వండి... ఈ సమస్యలు అధిగమించడానికి అధికారులకు కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. 

కచ్చితంగా రైతుకు ప్రాధాన్యమిచ్చి వారి కోరిన విధంగా వారికి అందుబాటులో దగ్గరలో ఉన్న మిల్లులకు తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించామని నాదెండ్ల చెప్పారు. కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఎక్కడైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నామో వారికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా 24 నుంచి 48 గంటల్లోపే కల్లాల దగ్గర ఉన్న ధాన్యం మిల్లుల వద్దకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని వివరించారు. 

"ధాన్యం కొనుగోలు అవ్వగానే 24 గంటల్లోపు రైతు ఖాతాల్లో జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసి కొన్ని సంస్కరణలను తీసుకొచ్చాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మన రాష్ట్రంలో అనేకమంది కౌలు రైతులు కాబట్టి వారికి నష్టం కలగకుండా చూసే బాధ్యత మాపై ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, కౌలు రైతుల విషయంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా చేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని, ప్రతి రైతుని ఆదుకునే విధంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది" అన్నారు. 

అనంతరం కంకిపాడు మండలం దావులూరు గ్రామంలోని బాలాజీ రైస్ మిల్ మంత్రి సందర్శించారు. అక్కడ రైతు సమస్యలను విన్న మంత్రి.... రైస్మిల్ యజమానులు రైతులకు సహకరించాలన్నారు.
Nadendla Manohar
Rythu Seva centers
Krishna District
Janasena
Andhra Pradesh

More Telugu News