DK Shivakumar: కొన్ని గ్యారెంటీలను నిలిపేయాలన్న సొంత పార్టీ ఎమ్మెల్యేపై డీకే శివకుమార్ ఆగ్రహం

Karnataka MLA Leaves Congress Red Faced DK Shivakumar Angry Retort
  • నిధుల కొరత కారణంగా కొన్ని హామీలు నిలిపేయాలన్న ఎమ్మెల్యే గవియప్ప
  • షోకాజ్ నోటీసులు జారీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ
  • ఏ హామీని ఆపేది లేదని డీకే శివకుమార్ స్పష్టీకరణ
నిధుల కొరత కారణంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీలను నిలిపేయాలని బహిరంగ సమావేశంలోనే ఓ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే... ముఖ్యమంత్రిని కోరారు. నిధుల కొరత... హామీలను నిలిపేయాలంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా కోరడాన్ని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా పరిగణించారు. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. గ్యారెంటీలని నిలిపేయబోమని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయనగర ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప కొన్ని హామీలను నిలిపేయాలని సీఎంను కోరారు. ఎన్నికల హామీల కారణంగా ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆర్థిక భారంగా మారిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయడం చాలా కష్టంగా మారిందన్నారు. అవసరం లేని రెండు మూడు హామీలను రద్దు చేయాలని సీఎంను కోరుతున్నానని బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. హామీలను రద్దు చేస్తే అప్పుడు ప్రజలకు కనీసం ఇళ్లనైనా ఇవ్వగలమన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని సీఎంకే వదిలేస్తున్నామన్నారు.

హామీలను అమలు చేయడం కోసం ఎక్కడెక్కడి నుంచో రూ.40 వేల కోట్లు తీసుకొచ్చామన్నారు. ఏ హామీ సాధ్యమైతే దానిని నెరవేరుస్తున్నామన్నారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం పనులు చేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి మనమంతా సీఎంకు అండగా ఉండాలన్నారు.

అయితే, పార్టీకి చెందిన ఎమ్మెల్యే గవియప్ప వాదనతో ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ విభేదించారు. తమ ప్రభుత్వం ఏ హామీ విషయంలోనూ వెనక్కిపోదని స్పష్టం చేశారు. హామీలు రద్దు చేయాలన్న పార్టీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం మాత్రం హామీలకు కట్టుబడి ఉందన్నారు.
DK Shivakumar
Congress
Karnataka

More Telugu News