Nana Patole: మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోర పరాజయ ఫలితం.. కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే రాజీనామా

Nana Patole Quits As Maharashtra Congress Chief
  • ‘మహా’ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే గుడ్‌బై
  • అసెంబ్లీ ఎన్నికల్లో 16 సీట్లకే కాంగ్రెస్ పరిమితం
  • 208 ఓట్లతో అతికష్టం మీద గెలిచిన నానా పటోలే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం కాంగ్రెస్‌కు తీరని అవమానాన్ని మిగిల్చింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (ఎంవీఏ)లో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 103 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 16 సీట్లలోనే విజయం సాధించింది. సకోలీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే 208 ఓట్ల తేడాతో గట్టెక్కారు. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నానా పటోలే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 

మాజీ ఎంపీ అయిన పటోలే 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 17 స్థానాలకు గాను 13 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బోల్తా కొట్టింది. ఎన్నికలకు ముందు సీట్ల పంపకం విషయంలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్), కాంగ్రెస్ మధ్య విభేదాలు పొడసూపాయి. పటోలే జోక్యం చేసుకుంటే సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్‌తో చర్చలు ఉండబోవని థాకరే టీం సంచలన ప్రకటన కూడా చేసింది. 

ఎన్నికల ఫలితాలకు రెండ్రోజుల ముందు కూడా నానా పటోలే మాట్లాడుతూ కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడం సంజయ్ రౌత్‌కు కోపం తెప్పించింది. దీనిని తాను అంగీకరించబోనని చెప్పారు. అయితే, ఫలితాలు తారుమారయ్యాయి. గత ఎన్నికల్లో 44 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈసారి 16 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో నానా పటోలే అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Nana Patole
Maharashtra
Congress

More Telugu News