KTR: భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

What a swing indeed from 150 all out to 0 for 172 says KTR
  • రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్న భారత్ బ్యాటింగ్‌‌ తీరుపై కేటీఆర్ ఆశ్చర్యం
  • తొలి ఇన్నింగ్స్‌లో 150కి ఆలౌట్ నుంచి 172/0 స్థితిలో నిలిచారంటూ ప్రశంసలు
  • అందుకే టెస్ట్ క్రికెట్ ఎప్పుడూ ప్రత్యేకమేనన్న కేటీఆర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌పై టీమిండియా గట్టి పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో ఔరా అనిపించేలా బ్యాటింగ్ చేస్తోంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 172 స్కోర్ సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఒక్క వికెట్ కూడా పడకుండా అద్భుతంగా ఆడారు. ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యలుగా మారారు.

జైస్వాల్ 90, రాహుల్ 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే ఆలౌట్ కావడంతో లభించిన 46 పరుగుల స్వల్ప లీడ్‌తో కలుపుకొని భారత్ ప్రస్తుతం 218 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పుంజుకున్న విధానంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

పెర్త్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న క్రేజీ టెస్ట్ మ్యాచ్‌ హైలెట్స్ ఇప్పుడే చూశానని ఎక్స్ వేదికగా స్పందించారు. తొలి ఇన్నింగ్స్‌లో 150/10 స్థితి నుంచి రెండో ఇన్నింగ్స్‌లో 172/0 వరకు ఎంత మారిపోయిందంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నమ్మశక్యం కాని ప్రదర్శన అని, అందుకే టెస్టు క్రికెట్‌ ఎల్లప్పుడూ ఎంతో ప్రత్యేకం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ - కేఎల్ రాహుల్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీల నుంచి క్రికెట్ అభిమానుల వరకు అందరూ మెచ్చుకుంటున్నారు.
KTR
Cricket
Sports News
india vs Australia

More Telugu News