Patnam Narendar Reddy: పట్నం నరేందర్ రెడ్డిని ఉగ్రవాదిలా అరెస్ట్ చేశారు: కోర్టులో న్యాయవాది

Court reserved judgment on Patnam Narendar Reddy petition
  • అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదన్న నరేందర్ రెడ్డి న్యాయవాది
  • భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు
  • నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే కలెక్టర్ మీద దాడి జరిగిందన్న పీపీ
  • తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
15 మంది పోలీసులు మఫ్టీలో వచ్చి పట్నం నరేందర్ రెడ్డిని ఓ ఉగ్రవాదిలా అరెస్ట్ చేసి తీసుకుపోయారని ఆయన తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. లగచర్ల దాడి కేసులో అరెస్టై, జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు కూడా వాదనలు జరిగాయి. కొడంగల్ కోర్టు విధించిన రిమాండ్‌ను కొట్టేయాలని నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపారు.

ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఫార్మా విలేజ్ కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియోలను సీడీల రూపంలో కోర్టుకు అందించారు. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ప్రజలు, రైతులు... కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేసినట్లు తెలిపారు. నరేందర్ రెడ్డి కేబీఆర్ పార్కుకు వెళుతుంటే అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అరెస్టుకు సంబంధించి కొన్ని ఫొటోలను కోర్టుకు సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
Patnam Narendar Reddy
Telangana
BRS
Congress

More Telugu News