Job Interview: జాబ్ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ అడిగిన ప్రశ్నతో అవాక్కైన అభ్యర్థి.. ఇదేం ప్రశ్న అంటూ ట్వీట్

UK Based Indian Woman Says HR Asked Her About Marriage Plans
  • ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగిన హెచ్ఆర్
  • ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అయ్యానన్న మహిళా అభ్యర్థి
  • ఇంకా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా అంటూ పోస్ట్
ఉద్యోగ నియామకానికి జరిపే ఇంటర్వ్యూలో అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు హెచ్ఆర్ సిబ్బంది రకరకాల ప్రశ్నలు సంధిస్తుంటారు.. పూర్వానుభవం, ఈ ఉద్యోగానికే ఎందుకు దరఖాస్తు చేశారు, మీకే జాబ్ ఎందుకివ్వాలి, మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి.. ఇలా పలు రకాల ప్రశ్నలు అడిగి అభ్యర్థి ఇచ్చే జవాబులతో సదరు క్యాండిడేట్ పై అంచనాకు వస్తుంటారు. అయితే, యూకేకు చెందిన భారతసంతతి యువతి ఓ జాబ్ ఇంటర్వ్యూలో తనకు వింత అనుభవం ఎదురైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

సదరు కంపెనీ హెచ్ఆర్ ఉద్యోగి తన వయసు అడిగారని చెప్పుకొచ్చారు. పాతికేళ్లు అని తను జవాబు చెప్పగా.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? అని అడిగారన్నారు. దీంతో తాను అవాక్కయ్యానని, తాను విన్నది నిజమేనా? లేక తానేమైనా పొరబడ్డానా? అనుకున్నానని వివరించారు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా? అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ట్వీట్ కు లక్షకు పైగా వ్యూస్, వందలాది మంది కామెంట్లు పెడుతున్నారు. భారత దేశంలో తమకూ ఇలాంటి అనుభవం ఎదురైందని చాలామంది నెటిజన్లు కామెంట్లలో వెల్లడించారు. కొత్తగా పెళ్లైన వారికి పిల్లల గురించి ప్లాన్ చేస్తున్నారా? అని కూడా అడుగుతుంటారని మరికొందరు చెప్పుకొచ్చారు. అయితే, కొంతమంది యూజర్లు మాత్రం ఇందులో తప్పేమీ లేదంటూ సమర్థించారు. 

కంపెనీలు మానవ వనరుల పైనే ఆధారపడి మనుగడ సాగిస్తాయని, ముఖ్యమైన ప్రాజెక్టులు చేస్తున్నపుడు ఉద్యోగులు పెళ్లి, ప్రెగ్నెన్సీల కోసం సెలవు పెడితే ఆయా ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసే అవకాశం ఉండదని వివరించారు. దీనివల్ల అటు కంపెనీకి, ఇటు తోటి ఉద్యోగులపై భారం పెరుగుతుందని, అందుకే హెచ్ఆర్ సిబ్బంది ఇంటర్వ్యూ సమయంలోనే ఈ వివరాలు అడుగుతుంటారని పేర్కొన్నారు.
Job Interview
UK Women
HR Interview
Viral Tweet

More Telugu News