Marriage Gifts: కొత్తగా పెళ్లయిన వారికి... ఈ వస్తువులు అస్సలే ఇవ్వొద్దట!

As per Vastu shastra these items should never gift to For newly wed couples
  • వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల బహుమతులు ఇస్తే మంచిది కాదంటున్న నిపుణులు
  • ముఖ్యంగా ఏడు వస్తువులు వద్దని సూచనలు
  • ఇదొక నమ్మకం మాత్రమేనని... ఇష్టమైతేనే అనుసరించవచ్చని స్పష్టీకరణ
స్నేహితులు, బంధువులు, కొలీగ్స్... ఇలా ఎవరో ఒకరి ఇళ్లలో పెళ్లి జరిగితే హాజరవుతూ ఉంటాం. మన తాహతుకు తగినట్టుగా ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉంటాం. ఇది మామూలు విషయమే. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల బహుమతులు ఇస్తే మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏడు రకాల వస్తువులు బహుమతిగా ఇవ్వవద్దని సూచిస్తున్నారు. అయితే ఇది వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారికి మాత్రమేనని... ఇష్టమైతేనే అనుసరించవచ్చని స్పష్టం చేస్తున్నారు. 

అద్దాలు (మిర్రర్స్)
కొత్తగా పెళ్లయిన జంటలకు అద్దాలు బహుమతిగా ఇవ్వవద్దని వాస్తు శాస్త్రం చెబుతోందని నిపుణులు అంటున్నారు. అద్దాలు ఇగోను, మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయని... ఇరువురి మధ్య ఐక్యత కంటే, ఎవరికి వారే అనే తత్వం పెరుగుతుందని చెబుతున్నారు. అసలు వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్ లలో, లివింగ్ ఏరియాలలో అద్దాలు పెట్టుకోకూడదని చెబుతోందని పేర్కొంటున్నారు.

కాక్టస్ లు, ఇతర ముళ్ల మొక్కలు
ఇటీవలి కాలంలో అందంగా, అలంకరణ కోసం కాక్టస్ ప్లాంట్లు పెట్టుకోవడం పెరిగిపోయింది. అలాంటి కాక్టస్ లు, ఇతర ముళ్ల మొక్కలను కొత్త జంటలకు బహుమతిగా ఇవ్వొద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కల నుంచి నెగెటివ్ ఎనర్జీ వెలువడుతుందని... ఇళ్లలో పెట్టుకుంటే అనుబంధాలు దెబ్బతింటాయని పేర్కొంటున్నారు. ప్రశాంతత లేకుండా పోతుందని అంటున్నారు.

నలుపు, ముదురు రంగు వస్తువులు
నలుపు, దానికి దగ్గరగా ఉండే తీవ్ర ముదురు రంగులోని వస్తువులను కొత్త దంపతులకు బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని... దురదృష్టానికి కారణమవుతాయని పేర్కొంటున్నారు. అందువల్ల ఎరుపు, గులాబీ, పసుపు రంగులు, లేత రంగుల వస్తువులు గిఫ్ట్ గా ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఖాళీ కూజాలు, కుండల వంటివి...
కొత్త దంపతులకు ఖాళీ కూజాలు, పూల కుండీల వంటి ఖాళీ అలంకరణ వస్తువులు బహుమతిగా ఇవ్వవద్దని... అవి ఒంటరితనానికి, లేమికి సూచనలు అని వాస్తు నిపుణులు అంటున్నారు. అవి దంపతుల మధ్య దూరాన్ని పెంచుతాయని పేర్కొంటున్నారు. అలాంటివి బహుమతిగా ఇవ్వాలనుకుంటే... పూల బొకేలు, పూల మొక్కలు వంటివి పెట్టి ఇవ్వాలని సూచిస్తున్నారు.

గడియరాలు, వాచీలు
వాస్తు శాస్త్రం ప్రకారం గడియారాలు, వాచీలు వంటివి ప్రతిదీ అశాశ్వతం, సమయం గడిచిపోతోందని గుర్తు చేసేవని నిపుణులు చెబుతున్నారు. ఇవి బంధాలను బలహీనం చేస్తాయని అంటున్నారు. కావాలంటే ఫొటో ఫ్రేములు, జంటగా ఇచ్చే ఆభరణాలు వంటివి ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఒంటరి వస్తువులు, ఒంటరి చిత్రాలు...
ఏవైనా ఒంటరిగా ఉన్న స్త్రీ, పురుషుల చిత్రాలు, ఒకే క్యాండిల్, ఒకే లైట్ వంటివి కొత్త దంపతులకు బహుమతిగా ఇవ్వవద్దని... అవి ఒంటరితనానికి, అసమతౌల్యానికి గుర్తు అని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఇస్తే స్త్రీ పురుషులు జంటగా, ప్రేమగా ఉన్న చిత్రాలు, జంటగా ఉండే వస్తువులు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇది దంపతుల మధ్య సాన్నిహిత్యం పెంచుతుందని వివరిస్తున్నారు.
Marriage Gifts
vastu
offbeat
Wedding
New couples

More Telugu News