Thummala: ఆ కంపెనీల అనుమతులను రద్దు చేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరిక

Minister Tummala warning oil palm companies
  • పామాయిల్ కంపెనీల పురోగతిపై మంత్రి సమీక్ష
  • పురోగతిని చూపించకుంటే అనుమతి రద్దు చేసి ఆయిల్ ఫెడ్‌కు అప్పగిస్తామని వెల్లడి
  • ప్రతి కంపెనీ కూడా నర్సరీని కలిగి ఉండాలని ఆదేశాలు
పురోగతి చూపించని పామాయిల్ కంపెనీలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోని కంపెనీల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. పామాయిల్ కంపెనీల పురోగతిపై మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. పామాయిల్ సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా ఉంచాలన్నారు.

పురోగతి చూపించని ఆయిల్ కంపెనీలకు అనుమతులు రద్దు చేసి... తెలంగాణ ఆయిల్ ఫెడ్‌కు అప్పగిస్తామన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రతి కంపెనీ కూడా వారికి కేటాయించిన జోన్లలో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 64,040 హెక్టార్లలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేసినట్లు చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లక్ష ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 25 వేలకు పైగా ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తయిందన్నారు.

ప్రతి కంపెనీ కూడా నర్సరీని కలిగి ఉండాలని, అత్యధికంగా నూనె శాతాన్ని ఇచ్చే వంగడాలను, గ్యానో డెర్మా లాంటి తెగుళ్లను తట్టుకునే వంగడాలను, తక్కువ ఎత్తు పెరిగే పొట్టి రకాలకు సంబంధించిన నాణ్యమైన మొలకలను తెప్పించుకొని నర్సరీలలో పెంచి రైతులకు సరఫరా చేయాలని సూచించారు. ప్రస్తుతం టన్ను పామాయిల్ గెల ధర రూ.6 వేలకు పైగా ఉందని, త్వరలో రూ.20 వేలకు చేరుకునే అవకాశముందన్నారు.
Thummala
Telangana
Congress
Oil Company

More Telugu News