AI Grandmother: ఆన్‌లైన్ మోసగాళ్లకు చుక్కలు చూపించే ‘ఏఐ బామ్మ’

AI Grandmother to talk online scammers and waste their time
  • స్కామర్ల ఆట కట్టించేందుకు ఏఐ బామ్మ డైసీని సృష్టించిన బ్రిటన్ టెలికం కంపెనీ ‘ఓ2’
  • స్కామర్లతో తియ్యగా నిమిషాల తరబడి మాట్లాడుతూ గుట్టుమట్లు తెసుకునే డైసీ
  • అర్థంపర్థం లేని సంభాషణతో స్కామర్లను అసహనానికి గురిచేసే ఏఐ బామ్మ
  • ఫలితంగా వారి లక్ష్యం నెరవేరకుండా అడ్డుకట్ట
ఆన్‌లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ఒక్క మన దగ్గరే కాదు ప్రపంచం మొత్తం ఈ స్కామర్ల బారినపడి కోట్లాది రూపాయలు సమర్పించుకుంటోంది. ఒక్క ఫోన్ కాల్ ద్వారా డబ్బులు దండుకుంటున్న ఘటనలు రోజూ వెలుగుచూస్తున్నాయి. బ్రిటన్‌లోనూ ఆన్‌లైన్ స్కామర్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి ఆటకట్టించి వినియోగదారులను రక్షించాలన్న ఉద్దేశంతో యూకే టెలికం కంపెనీ ‘ఓ2’ ఓ సరికొత్త ప్రయోగంతో ముందుకొచ్చింది. ఏఐ బామ్మను సృష్టించి దానికి డైసీ అని పేరు పెట్టింది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బామ్మ ఆన్‌లైన్ స్కామర్ల భరతం పడుతుంది. వారితో తియ్యగా మాట్లాడుతూ సమయాన్ని వృథా చేస్తుంది. వారిని అసహనానికి గురిచేస్తుంది. ఫలితంగా ఆన్‌లైన్ స్కామర్ల బారినపడకుండా వినియోగదారులను రక్షిస్తుంది.

ఫోన్ చేసే స్కామర్లకు ఏఐ గ్రాండ్‌మదర్ డైసీ చుక్కలు చూపిస్తుంది. తాము ఎవరితో మాట్లాడుతున్నామో తెలియనంత తీయగా మాట్లాడుతుంది. నిజంగా తాము మనిషితోనే మాట్లాడుతున్నంతగా వారిని భ్రమలోకి నెట్టేస్తుంది. వారితో మాట్లాడుతూనే వారి గుట్టుమట్లు తెలుసుకుంటుంది. అర్థంపర్థంలేని సంభాషణలతో వారికి విసుగు తెప్పిస్తుంది. కుటుంబ విషయాలు కూడా మాట్లాడుతుంది. ఇలా దాదాపు 40 నిమిషాల పాటు ఎడతెగకుండా మాట్లాడుతూ వారి సమయాన్ని వృథా చేస్తూ వారిని అసహనానికి గురిచేస్తుంది. ఫలితంగా ఆమె చెప్పే సోది వినలేని ఆన్‌లైన్ నేరగాళ్లు చివరికి ఫోన్ పెట్టేస్తారు. దీంతో వారు చెయ్యాలనుకున్న మోసానికి అక్కడితో తెరపడుతుంది.

స్కామ్‌బైటర్స్‌తో కలిపి ఓ2 ఈ డైసీ బామ్మను అభివృద్ధి చేసింది. ఓ2 కంపెనీ ప్రతి నెల మిలియన్ల కొద్దీ స్కామర్ల కాల్స్‌ను, టెక్స్ట్ మెసేజ్‌లను బ్లాక్ చేస్తోంది. అయినప్పటికీ వారి ఆగడాలు ఆగకపోతుండడంతో వారిపైకి ప్రయోగించేందుకు ఈ డైసీ బామ్మను సృష్టించింది.
AI Grandmother
O2
UK
Online Scammers

More Telugu News