kadambari jethwani: నటి జెత్వానీ కేసు: విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16న తీర్పు

actress kadambari jethwani case
  • రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నటి జెత్వానీ కేసు 
  • కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ
  • విద్యాసాగర్‌కు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసిన జెత్వానీ తరపు న్యాయవాది శ్రీనివాసరావు
తీవ్ర సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో గురువారం విచారణ జరిగింది. తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారని కొద్ది రోజుల క్రితం కాదంబరి జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు ఇటీవల డెహ్రాడూన్‌లో పట్టుకుని ఆరెస్టు చేశారు. ఆయనను పోలీసులు కోర్టులో హజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు ఇవ్వడంతో జైలుకు తరలించారు. ఈ క్రమంలో విద్యాసాగర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్‌పై గురువారం న్యాయస్థానం విచారణ జరపగా, జెత్వానీ తరపున న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేస్తే ఆయన కేసును ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపారు. నిందితుడికి ఐపీఎస్ అధికారులు సైతం సహకరించారని తెలిపారు. 

తప్పుడు పత్రాలు సృష్టించి జెత్వానీని 42 రోజుల పాటు జైలులో ఉంచారని చెప్పారు. విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేస్తే వాస్తవాలు బయటకు రాకుండా చేస్తారని అన్నారు. నిందితుడు పారిపోయే అవకాశం ఉందని జెత్వానీ తరపున న్యాయవాది శ్రీనివాసరావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈ నెల 16న (రేపు) బెయిల్ పిటిషన్‌‌పై తీర్పు వెల్లడించనుంది. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
kadambari jethwani
Kukkala vidyasagar
AP Police

More Telugu News