Posani Krishna Murali: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై వ్యాఖ్యలు... నటుడు పోసానిపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు

So many complaints against Posani after he made comments on BR Naidu
  • టీటీడీ చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు
  • పోసానిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • పోసాని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ బీఆర్ నాయుడుపై సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోసానిపై పలు జిల్లాల్లో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ చైర్మన్ పై వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

టీటీడీ చైర్మన్ పై వ్యాఖ్యలు చేయడం సనాతన ధర్మాన్ని అవమానించడమేనని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. పోసాని తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.  

గుంటూరు జిల్లా పట్టాభిపురం పీఎస్ లోనూ ఫిర్యాదు దాఖలైంది. బాపట్ల అర్బన్ పీఎస్ లో పోసానిపై టీడీపీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మైనర్ బాబు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోనూ ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా యాదమర్రి పోలీస్ స్టేషన్ లో పోసానిపై తెలుగు యువత నేత అమరనాథ నాయుడు ఫిర్యాదు చేశారు. 

నగరి నియోజకవర్గం పుత్తూరు అర్బన్ పీఎస్ లోనూ పోసానిపై ఫిర్యాదు అందింది. పోసాని వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ పుత్తూరు అర్బన్ పీఎస్ లో టీవీ5 చానల్ ప్రతినిధి ఫిర్యాదు చేశారు. 

అటు, అనంతపురం ఎస్పీకి కూడా పోసానిపై ఫిర్యాదు చేశారు. పోసాని వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. గతంలోనూ పోసాని ఇలాంటి వ్యాఖ్యలే చేశారని తెలిపారు. విచారణ జరిపి పోసానిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎస్పీని కోరారు. అన్ని అంశాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీశ్ హామీ ఇచ్చారు.
Posani Krishna Murali
BR Naidu
TTD Chairman
Complaints
Police
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News