Revanth Reddy: లగచర్ల ఫార్మా విలేజ్‌పై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కీలక ప్రకటన

Wont back off from Pharma Village says Telangana CM brother
  • ఫార్మా విలేజ్ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదన్న సీఎం సోదరుడు 
  • ఫార్మాతో పాటు మరిన్ని పరిశ్రమలు వస్తాయన్న తిరుపతిరెడ్డి
  • దాడి ఘటనలో అందరూ అరెస్ట్ అవుతారన్న సీఎం సోదరుడు
కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బుధవారం ప్రకటించారు. సోమవారం లగచర్ల గ్రామంలో ప్రతిపాదిత ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, రైతులు వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కొడంగల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ తిరుపతిరెడ్డి ఈ ప్రాజెక్టుపై స్పందించారు. ఆయన ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపాదిత ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఇక్కడకు పరిశ్రమ తప్పకుండా వస్తుందని, ఫార్మా మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు కూడా వస్తాయన్నారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

కలెక్టర్, ఇతర అధికారులపై దాడిని తిరుపతి రెడ్డి ఖండించారు. దాడికి పాల్పడిన వారందరూ అరెస్ట్ అవుతారన్నారు. ఫార్మా ప్రాజెక్టుపై శాంతియుతంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంటే అమాయకులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కుంటోందన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై తిరుపతి రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్లుగా తాము రాత్రికి రాత్రే గ్రామాలను ఖాళీ చేయించడం లేదని చురక అంటించారు. రైతులపై దాడులు కూడా చేయడం లేదన్నారు.

కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసిన డీకే అరుణ

బీజేపీ ఎంపీ డీకే అరుణ ఈరోజు కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిశారు. లగచర్ల ఘటనపై ఆయనను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, ఆమె లగచర్ల గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ మన్నెగూడ ప్రాంతంలో ఆమె రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
 
Revanth Reddy
Congress
Telangana
District Collector

More Telugu News