భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ తిరుగుబాటుదారుల మృతి
- ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు
- ఒక పోలీస్ స్టేషన్, అక్కడికి సమీపంలోనే ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంప్ లక్ష్యంగా కుకీ మిలిటెంట్ల కాల్పులు
- ప్రతిస్పందించి కాల్పులు జరిపిన భద్రతా బలగాలు
- మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత
ఈ ఎదురుకాల్పుల ఘటన తర్వాత పోలీసు స్టేషన్ రిలీఫ్ క్యాంపులో ఉన్న ఐదుగురి ఆచూకీ తెలియడం లేదని, వారి కోసం అన్వేషిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. వీరిని కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారా? లేక దాడి ప్రారంభమైన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారా? అనేది తెలియరాలేదని అన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
కాగా ఘటన జరిగిన జిరిబామ్ జిల్లాలో బీఎన్ఎస్ఎస్‌లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడానికి వీల్లేదు. కొందరు సంఘవ్యతిరేక శక్తులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి ప్రజాశాంతికి విఘాతం కలిగించడం లేదా అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఎదురుకాల్పుల ఘటన తర్వాత ఇంఫాల్ పశ్చిమ, తూర్పు జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.