KTR: ప్రశ్నించేవారంటే రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు?: కేటీఆర్

KTR blames Revanth Reddy for arrest journalist
  • జర్నలిస్ట్ అరెస్ట్ అప్రజాస్వామికమన్న కేటీఆర్
  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం
  • నిఘా వేసి.. రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేశారన్న హరీశ్ రావు
ప్రశ్నించే వారంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. జర్నలిస్ట్, వైఆర్ టీవీ రంజిత్‌ను అరెస్ట్ చేయడంపై కేటీఆర్, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ అరెస్ట్ అప్రజాస్వామికమని కేటీఆర్ మండిపడ్డారు. 

రాష్ట్రంలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారని, దాడులు చేస్తున్నారని విమర్శించారు. మీ 11 నెలల పాలనలో జర్నలిస్ట్‌లపై దాడులు, అక్రమ కేసులు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చేసే దద్దమ్మ పనులను నిలదీసినందుకే జర్నలిస్ట్ రంజిత్‌ను నిర్బంధించారన్నారు. అతనిని వెంటనే విడుదల చేయాలని... అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్‌లపై ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.

జర్నలిస్ట్ అరెస్టును హరీశ్ రావు ఖండించారు. నిఘా వేసి, రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేయడమేమిటని ప్రశ్నించారు. ఇది అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తిచూపితే అరెస్ట్ చేయడమేమిటన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
KTR
Revanth Reddy
Telangana

More Telugu News