Pakistan: పాక్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు.. 20 మంది మృతి

Blast at Quetta railway station in Balochistan 20 dead
  • బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఆత్మాహుతి దాడి!
  • తీవ్రంగా గాయపడిన మరో 30 మంది
  • పేలుడు సమయంలో ప్లాట్‌ఫాంపై 100 మంది ప్రయాణికులు
  • గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమం
పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్ శనివారం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పెషావర్ వెళ్లేందుకు ప్లాట్‌ఫాంపై రైలు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడులో 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఎగిరిపడ్డాయి. ఇది ఆత్మాహుతి దాడిలా అనిపిస్తోందని, అయితే నిర్ధారించాల్సి ఉందని క్వెట్టా సీనియర్ ఎస్పీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నట్టు చెప్పారు. 

బాంబు పేలిన సమయంలో ప్లాట్‌ఫాంపై దాదాపు 100 మంది ఉన్నట్టు ఎస్సెస్పీ తెలిపారు. క్వెట్టా నుంచి రావల్పిండి వెళ్లేందుకు ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.  

పాకిస్థాన్‌లో అత్యంత పేద ప్రావిన్స్ అయిన బలూచిస్థాన్‌ వేర్పాటువాదులకు అడ్డాగా మారింది. అక్కడి ఉగ్రవాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) గతంలోనూ పలుమార్లు దాడులకు పాల్పడింది. పాక్ ఆర్మీ, ఇతర ప్రావిన్సుల్లోని పాకిస్థానీలపై తరచూ దాడులు చేస్తూ ఉనికి చాటుకుంటోంది. ఈ ఏడాది ఆగస్టులో 39 మందిని దారుణంగా హత్య చేసింది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద దాడి.
Pakistan
Qetta Railway Station
Balochistan

More Telugu News