Viral News: సీఎం కోసం తెప్పించిన సమోసాలు ఎవరు తిన్నారు?... డీఎస్పీతో విచారణ

Samosas meant for Himachal CM eaten by some others and Police investigation lauched
  • హిమాచల్ ప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన
  • సీఎం సుఖ్విందర్ సింగ్‌కు అందాల్సిన అల్పాహారంగా తినేసిన ఆయన సిబ్బంది
  • సమన్వయం లోపం కారణంగా సీఎంకు చేరని సమోసాలు
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో సమోసాలు హాట్ టాపిక్‌గా మారాయి. అక్టోబర్ 21న సైబర్ వింగ్ స్టేషన్ ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కోసం ప్రత్యేకంగా తెప్పించిన సమోసాలు ఆయనకు చేరకుండానే అయిపోయాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించడం చర్చనీయాంశంగా మారింది. 

ఈ వ్యవహారంలో ఐదుగురు పోలీసులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా సీఎంకు అందించడానికి ప్రత్యేక బాక్సుల్లో సమోసాలు, కేక్‌లు తెప్పించారు. అయితే వీటిని సీఎం కోసం తెప్పించినట్టు ఒక ఎస్‌ఐకి మాత్రమే తెలుసు. ఆయన ఒక మహిళా ఇన్‌స్పెక్టర్‌కు వీటిని అందించారు. అయితే  సీనియర్ అధికారులు ఎవరూ ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోడంతో బాక్సులను ఆమె సీఎం సిబ్బందికి, మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంటీ) విభాగం సిబ్బందికి అల్పాహారంగా అందించారని దర్యాప్తులో తేలింది.

సమన్వయం లోపం కారణంగా సీఎంకు సమోసాలు చేరలేదన్న విషయం బయటపడింది. ఈ వ్యవహారంపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేపట్టారు. ఈ బాక్సులను పర్యవేక్షించిన మహిళా ఇన్‌స్పెక్టర్ పైఅధికారుల నుంచి ఎలాంటి క్లియరెన్స్ లేకుండానే మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ విభాగానికి పంపించారని, వాటిని సీఎం సిబ్బందికి వడ్డించారని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య అని సీఐడీ విడుదల చేసిన నివేదికలో ఒక అధికారి పేర్కొన్నారు. వీవీఐపీ గౌరవానికి వ్యతిరేకంగా జరిగిన నేరమని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారు వారి సొంత ఎజెండా ప్రకారం వ్యవహరించినట్టు కనిపించిందని సీఐడీ నివేదిక పేర్కొంది.
Viral News
Trending news
Himachal Pradesh
Samosas

More Telugu News