Team India: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళుతుందా? వెళ్లదా?... బీసీసీఐ నిర్ణయం ఇదే!

BCCI has communicated their decision to the PCB on Team India visit to Pakistan
  • పాక్‌లో పర్యటించబోమని పీసీబీకి తేల్చి చెప్పిన బీసీసీఐ
  • భారత మ్యాచ్‌లు అన్నింటినీ దుబాయ్‌లోని నిర్వహించాలని కోరినట్టు సమాచారం
  • భద్రతా కారణాలను పీసీబీ దృష్టికి తీసుకెళ్లిన బీసీసీఐ
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్ జట్టు ఆతిథ్య పాకిస్థాన్‌కు వెళుతుందా, వెళ్లదా? అనే సందేహాలు కొన్నాళ్లుగా వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా భారత జట్టు పాక్‌లో పర్యటించబోదని స్పష్టం చేసినట్టు సమాచారం. భారత మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడతామని బీసీసీఐ కోరినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది.

కాగా భారత జట్టు తన ప్రతి మ్యాచ్ ఆడిన తర్వాత తిరిగి స్వదేశం వెళ్లిపోవచ్చంటూ ఇటీవల బీసీసీఐకి పీసీబీ ప్రతిపాదించినట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్లాన్‌ను కూడా బీసీసీఐ తిరస్కరించినట్టు సమాచారం. పాకిస్థాన్‌లో పర్యటించబోమని బీసీసీఐ క్లారిటీ ఇచ్చినట్టు కథనాలు వెలువడుతున్నాయి. కాగా భారత జట్టు పాక్‌లో పర్యటించే విషయమై ఐసీసీ కలగజేసుకునే అవకాశం లేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించాలని క్రికెట్ బోర్డులను ఒత్తిడి చేసే అధికారం ఐసీసీకి లేదన్న విషయం తెలిసిందే.

‘‘ఇదే మా వైఖరి. దానిని మార్చడానికి ఎలాంటి కారణం లేదు. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా వాళ్లకు తెలియజేశాం. భారత మ్యాచ్‌లను దుబాయ్‌కి మార్చాలని కోరాం’’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్టు పేర్కొంది. కాగా పాకిస్థాన్ వేదికగా 2023లో ఆసియా కప్ జరిగింది. హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. ఫైనల్‌ మ్యాచ్‌ కూడా శ్రీలంకలోనే నిర్వహించడం గమనార్హం.
Team India
BCCI
Pakistan
PCB

More Telugu News