Supreme Court: రాజీ కుదిరిందని కేసు కొట్టేస్తారా.. లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్

Top Court Says Compromise Cant Lead To Sex Harassment Case Cancellation
  • రాజస్థాన్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన అత్యున్నత న్యాయస్థానం
  • ఎఫ్ఐఆర్ కొట్టేయడం సరికాదని వ్యాఖ్య
  • పోక్సో, అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదైందని గుర్తుచేసిన వైనం
లైంగిక వేధింపుల కేసులో రాజీ కుదిరిందనే కారణంతో కేసు కొట్టేయడం సబబు కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈమేరకు లైంగిక వేధింపుల కేసులో ఓ టీచర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ రాజస్థాన్ హైకోర్టు వెలువరించిన తీర్పును పక్కన పెట్టింది. సదరు టీచర్ ను ప్రాసిక్యూట్ చేయాలని పోలీసులను ఆదేశించింది.

కేసు ఏంటంటే..
2022లో రాజస్థాన్ లోని గంగాపూర్ సిటీలో ఓ దళిత బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విమల్ కుమార్ గుప్తా అనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో విమల్ కుమార్ గుప్తాపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతుండగా విమల్ కుమార్ గుప్తా బాధిత కుటుంబంతో రాజీ కుదుర్చుకున్నాడు.

అపోహతో, మిస్ అండర్ స్టాండింగ్ వల్ల తాము కేసు పెట్టామని, టీచర్ గుప్తాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని తాము కోరుకోవడంలేదంటూ బాలిక తల్లిదండ్రులతో ఓ స్టాంప్ పేపర్ రాయించుకున్నాడు. ఈ పేపర్ ను పోలీసులకు సమర్పించగా.. వారు కోర్టులో ఫైల్ చేశారు. అయితే, కోర్టు ఈ స్టాంప్ పేపర్ ను ఆమోదించలేదు. దీంతో గుప్తా రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు విచారించిన హైకోర్టు.. స్టాంప్ పేపర్ ను పరిశీలించి, బాలిక తల్లిదండ్రుల వాంగ్మూలం తీసుకున్నాక కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. గుప్తాపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ పోలీసులను ఆదేశించింది.

సుప్రీంకోర్టులో సోషల్ వర్కర్ పిటిషన్
రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై సోషల్ వర్కర్ రాంజీ లాల్ భైర్వా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుప్తాపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. లైంగిక వేధింపుల కేసులో రాజీకి అవకాశం లేదని పేర్కొంది. పైగా ఈ కేసులో పోక్సో చట్టం, అట్రాసిటీ యాక్ట్ ఇంక్లూడ్ అయి ఉన్నాయని గుర్తు చేసింది. టీచర్ విమల్ కుమార్ గుప్తాపై ఎఫ్ఐఆర్ పునరుద్ధరించి, ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని పోలీసులను ఆదేశించింది.
Supreme Court
sexual harassment
FIR
Rajasthan
High Court
POCSO
Police Case

More Telugu News